calender_icon.png 16 January, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖనిజాలపై రాష్ట్రాలకే రాయల్టీ

26-07-2024 03:54:33 AM

  1. పన్నులను రాయల్టీగా గుర్తించలేం
  2. మినరల్స్‌పై పార్లమెంట్‌కు అధికారం లేదు
  3. ఈ విషయంలో గతంలో భిన్నమైన తీర్పులు వచ్చాయి
  4. 1957 చట్టం సైతం రాష్ట్రాలకే ప్రధాన్యమిస్తుంది
  5. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం చారిత్రక తీర్పు

న్యూఢిల్లీ, జూలై 25: ఖనిజాలు, గనుల తవ్వకాలపై రాయల్టీకి సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఖనిజాలు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలకు పెద్ద విజయంగా భావించవచ్చు. ఈ విషయంపై విచారించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనం 8:1 నిష్పత్తితో తీర్పును ప్రకటించింది.

ఈ తీర్పులో జస్టిస్ బీవీ నాగరత్న మాత్రమే భిన్నాభిప్రాయాన్ని తెలియజేశారు. రాజ్యాంగం ప్రకారం గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు అధికారం లేదని ధర్మాసనం కరాఖ ండీగా చెప్పింది. రాయల్టీ అనేది పన్ను స్వభా వం కాదు. రాయల్టీ పన్ను కాదంటూ 1989 ఇండియా సిమెంట్స్ కేసులో ఇచ్చిన తీర్పు సరికాదని మేం నిర్ధారించాం. ప్రభుత్వానికి చెల్లింపులను పన్నుగా పరిగణించలేం. బకాయిలను రికవరీ చేయడానికి చట్టం అవకాశం కల్పించినంత మాత్రాన ప్రభుత్వానికి చేసే చెల్లింపులను పన్నుగా గుర్తించలేం అని సీజేఐ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. 

గతంలోని కేసులపై చర్చ

ఈ కేసుపై వాదనల్లో భాగంగా గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 ప్రకారం ఖనిజాలపై రాయల్టీని పన్ను గా గుర్తించవచ్చని, దీనిపై పార్లమెంటుకు గుంపగుత్తగా అధికారమివ్వచ్చని మైనింగ్ కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే వాదించారు. సాల్వే వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఖనిజ పరిశ్రమ అభివృద్ధికి జాతీయస్థాయిలో ఏకరూపత అవసమ రని పేర్కొన్నారు. ఇందులో విఫలమైతే రాష్ట్రాలవారీగా విభజించిన పన్నులు ఖనిజాల, గనుల అభివృద్ధికి ప్రతికూలంగా మారుతాయని హెచ్చరించారు. ప్రజాప్రయోజనాలకు ఖనిజాల వ్యవస్థాగత వినియోగంపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. 

నాటి తీర్పుల్లో తప్పులు దొర్లాయి

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఇండియా సిమెంట్స్ వర్సెస్ తమిళనాడు కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రాయల్టీని పన్నుగా గుర్తించవచ్చని తీర్పుచెప్పిందని గుర్తుచేసింది. అయితే, 2004 పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వర్సెస్ కేశోరాం కేసులో 1989 నాటి తీర్పులో తప్పులు దొర్లాయని, రాయల్టీ ఎప్పటికీ పన్ను కాబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల విషయంలో రెండు విభిన్నమైన తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ వివాదాన్ని తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును సుప్రీంకోర్టుకు అప్పగించారు. ఈ క్రమంలోనే ఏ ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిపిన ధర్మాసనం మార్చి 14న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కీలక కేసులో గురువారం తీర్పు వెలువరించింది.