మన మాణిక్యాలు
“ఆర్వేలాన్వయగేయ రాయసము
మల్లామాత్యు సూర్యస్వ వా
యోర్వీదేవ మిత స్వతంత్ర కపిగోత్రోద్భూత దత్తా హ్వయాం
తర్వాణీ ప్రియసూను కృష్ణ
విదూషాత్మ ప్రోద్భవుండైన యీ
బోర్వెల్లీపుర నారసింహకవి
సంబోధించి ఇట్లంటొగిన్”
అంటూ తన గురువైన బోరవెల్లి నరసింహకవిని ప్రస్తుతిస్తూ చెప్పిన ఈ పద్యం ఆయన శిష్యుడు, పెదపానుగల్లు దుర్గాధిపతి అయిన బోయినపల్లి కుమార వెంకటరాయల వారు రచించిన ‘ద్రౌపదీ కల్యాణం’ అనే కావ్యంలోనిది. ఈ కావ్యంలోనే ఆయన తన గురువుతోపాటు వారి తాత ముత్తాతలను గురించి కూడా ఈ పద్యంలో కీర్తించాడు.
“మీ తాత తాతకు భ్రాతృజ సూతిగ
దా రాయసము మల్లసూరి ‘చంద్ర
భానుచరిత్ర’ మొప్పగ జెప్పె,
మీ తాత దత్తన్న శబ్దశాస్త్ర ప్రవీణు
డతని సుతుండు కృష్ణప్ప ‘యయాతి
చర్రిత’ మిశ్రకావ్యమొనర్చె మీ జనకుడు
చేసితివీవు దక్షిణ కాశ్యలంపురి
నృహరిదయోదయా మహితకలిత
కృతియతని కంకితముగ బండితుల మతుల
నెనయ సౌపర్ణ కాఖ్యానమనగ నొకటి
యుభయ భాషా విశేషోక్తియు..
సిద్ధముగ సంప్రదాయ ప్రసిద్ధి గనుము”
అంటూ బోయినపల్లి వేంకటరాయల వారు తన గురువును, ఆయన పూర్వీకులను గురించి చెప్పాడు. ఈ పద్యంలో “మల్లన్న కవి ‘చంద్రభాను చరిత్ర’ రచించినట్లు, ఆయన తాత ‘దత్తన్న’ గొప్ప శబ్దశాస్త్ర ప్రవీణుడని, కవి తండ్రియైన ‘కృష్ణప్ప’కవి యయాతి చరిత్రను రచించాడని, ఈయన ‘సౌపర్ణాఖ్యానం’ రచించి అలంపురంలో కొలువై ఉన్న నరసింహ స్వామికి అంకితం చేసినాడని” తెలిపాడు.
ఇంటిపేరు తరిగొప్పుల
బోరవెల్లి నరసింహకవి ఇంటిపేరు ‘తరిగొప్పుల’ వారిగా చెప్పుకున్నాడు. అయితే, తరిగొప్పుల నుంచి వీరి పూర్వులు కొందరు ‘బోరవెల్లి’ సంస్థానానికి చేరి అక్కడే స్థిరపడిన కారణంగా ఇంటిపేరు కూడా మారిపోయింది. నరసింహకవి తాత అయిన తరిగొప్పుల మల్లన్నను ‘రాయసం మల్లన్న’గా సాహిత్య చరిత్రకారులు గుర్తించారు. దీనికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. రెండవ వేంకటపతి రాయల వారివద్ద మల్లన్న వ్రాయసగాడుగా ఉన్న కారణంగా ఆయన్ని ‘రాయసం మల్లన్న’గా గుర్తించారు. కానీ, వీరి తరం వారంతా బోరవెల్లిలో స్థిరపడినందున ఇంటిపేరు కూడా మారిపోయింది.
లభ్యం కాని రచనలు
బోరవెల్లి నరసింహకవి రచనలు సాహితీ ప్రియులకు లభించడం లేదు. ఈ కారణంగా వారి కవిత్వ ప్రతిభా విశేషాలు అందుబాటులోకి రాకున్నాయి. అయితే, ఆయన శిష్యుడైన బోయినపల్లి కుమార వేంకటరాయల కావ్యం వల్ల మాత్రం పలు విశేషాలు అందుబాటులోకి వస్తున్నాయి. బోరవెల్లి నరసింహ కవిని గురించి ఆచార్య బిరుదురాజు తమ ‘మరుగు పడిన మాణిక్యాలు’ పుస్తకంలో పరిచయం చేశారు.
“ఈ నరసింహకవి పుత్రుడు లయగ్రాహి గరుడాచల కవి” అని తెలిపారు. కానీ, ఆరుద్ర మరింతగా పరిశోధించి “వారి గోత్రాన్నిబట్టి చూస్తే, లయగ్రాహి గరుడాచల కవి ఈ నరసింహకవి కుమారుడు కాదు. కాకపోతే, ఆయన తండ్రిపేరు కూడా నరసింహ కవే” అని పేర్కొన్నారు.
శిష్యుని రచనల్లో గురువు విశేషాలు
బోరవెల్లి నరసింహకవి శిష్యుడు కుమార వేంకటరాయలు రచించిన ‘ద్రౌపదీ కల్యాణం’లోని పద్యాన్ని ఆరుద్ర ప్రమాణంగా నిర్ధారించారు. గురువుకు సంబంధించిన వివరాలు శిష్యునికి స్పష్టంగా అవగాహనలో ఉంటాయి కనుక వాటినే సత్యాలుగా భావించాలి. ఈ విషయాన్నే వ్యాస ప్రారంభంలోని “ఆర్వేలాన్వయ..” అన్న పద్యంలో బోరవెల్లి నరసింహకవి శిష్యుడైన కుమార వేంకటరాయలు తన గురువుగారి గోత్రం ‘స్వతంత్ర కపి’గా ఉటంకించాడు. “లయగ్రాహి గరుడాచల కవి, ఆయన తండ్రి అయిన నరసింహకవి వారి గోత్రం హరితస” అని వారి రచనలవల్లే స్పష్టమవుతున్నది. ఆరుద్ర ఈ పద్య ప్రమాణంతోపాటు నరసింహకవి తాత అయిన మల్లన కవి ‘చంద్రభాను చరిత్ర’ అవతారికలోని పద్యాన్ని ఉదహరించారు.
“శ్రీవిద్యావిభవాస్పదంబయిన
యార్వేలాన్వ వాయంబు సం
భావిత్రాభినుత స్వతంత్ర కపి
సన్మౌనీంద్ర గోత్రుల్ ధరా
దేవోత్తంసులు మించిరందు
బెడగొందెన్ భూజనశ్రేణి సం
భావింపం దరిగొప్పలాంకుడగు
శ్రీమల్ల ప్రధానుండిలన్”
అంటూ కవి గోత్రాన్ని గురించి నిర్ధారించడానికి ఈ పద్య ప్రమాణాన్ని చూపించారు. ఆచార్య బిరుదురాజు పేర్కొన్నట్టు “లయగ్రాహి గరుడాచల కవి నరసింహకవి పుత్రుడు కాదని” స్పష్టపరిచే ప్రయత్నం చేశారు ఆరుద్ర.
‘సౌపర్ణాఖ్యానం’తోపాటు ‘నరసింహ విలాసం’
‘సౌపర్ణాఖ్యాన’ కావ్యాన్ని రచించిన ఈ బోరవెల్లి నరసింహ కవే ‘నరసింహ విలాసము’ అనే మరొక కావ్యం కూడా రచించినట్టు ఆచార్య ఎస్.వి. రామారావు పేర్కొన్నారు. అయితే, ఈ రెండు కావ్యాలూ అలభ్యాలు కావడం తెలుగువారి దురదృష్టం.
తెలుగు సాహిత్య చరిత్రలో గద్వాల సంస్థానానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పరిపాలనా దక్షత చూపిన పాలకులే సాహితీప్రియులై ఎందరెందరో కవులకు, పండితులకు ఆశ్రయమిచ్చారు. పైగా, ఈ ప్రాంతంలోని చిన్నచిన్న సంస్థానాలకు కూడా వారు మార్గదర్శకులైనారు. వనపర్తి, కొల్లాపూరు, ఆత్మకూరు, బోరవెల్లి, అలంపూరు ప్రాంతాల పాలకులు సైతం వారి మార్గంలోనే సాగుతూ, కవి పండతులను ఆదరించారు.
పద్యకవితా ప్రపంచ గురువు
గద్వాల సంస్థానంలో ఘనమైన సన్మానాలను అందుకున్న కవి, ‘ముకుంద విలాసం’ అనే అపురూప పద్యకావ్యకర్త అయిన కాణాదం పెద్దనకు బోరవెల్లి నరసింహకవి స్వయాన బావమరిది అవుతారని చరిత్రనుబట్టి తెలుస్తున్నది. తెలుగు సాహిత్య ప్రపంచంలో గద్వాల అల్లసాని పెద్దనగా కీర్తి గడించిన కాణాదం పెద్దన ప్రభావం కూడా నరసింహకవిపై అమితంగానే ఉన్నట్టు సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
పద్యకవితా ప్రపంచంలో గురువుగా, శాస్త్ర వైదుష్యం కలిగిన గొప్ప విద్వన్మూర్తిగా సంభావితులైన బోరవెల్లి నరసింహ కవివర్యుల రచనలు తెలుగువారికి అందుబాటులోకి వచ్చి ఉంటే, ఎన్నెన్నో సరికొత్త విశేషాలు, వారి రచనా శైలి, ప్రతిభ, కావ్య నిర్మాణ శేముషి వంటివి అక్షర ప్రియులకు తెలిసి ఉండేది.
పండిత కవుల మన్ననలు
పెదపానుగల్లు దుర్గాధిపతి అయిన బోయినపల్లి కుమార వేంకటరాయలు తన గురువుగా భావించి గౌరవించిన బోరవెల్లి నరసింహకవి ఒక రాజగురువుగా మన్ననలు పొందడం విశేషం. నరసింహకవి ఆస్థానానికి వెళుతున్న సందర్భాల్లో పలువురు పండితులు తమ శాస్త్ర సంబంధమైన పలు సంశయాలను తీర్చుకొనే ప్రయత్నం చేసేవారనీ తెలుస్తున్నది. అంతేకాక, ప్రసిద్ధ కావ్యాల్లో ప్రయోగించిన ఉత్తమ శబ్దార్థాల స్వారస్యాలను కూడా అడిగి, తత్సంబంధమైన ఔన్నత్యాన్ని తమ అవగాహనలోకి తెచ్చుకునే వారని కూడా చరిత్రకారులు చెబుతారు. దీనిని బోరవెల్లి నరసింహకవి ప్రతిభకు తార్కాణంగా చెప్పాలి.
-గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448