29-03-2025 12:45:46 AM
కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత సినిమాలు చేయదేమో అని అందరూ అనుకున్నారు. చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉండటం కారణంగానే పెళ్లికి ముందు టాలీవుడ్‌లో నటించినప్పుడు ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పింది. దీంతో దక్షిణాదిన ఈ అమ్మడిపై హోమ్లీ గర్ల్ అనే ముద్ర పడింది. అయితే పెళ్లి తర్వాత అవకాశం వస్తుందో లేదో అనుకుందో..
లేక ఇన్నాళ్లూ దాచుకున్నదంతా బాలీవుడ్ ప్రేక్షకుల కోసమే అనుకుందో కానీ, అక్కడ గ్లామర్ డోస్ పెంచేసిందీ ‘మహానటి’. గత ఏడాది చివరలో ఆంటోనీ థాటిల్‌ను వివాహం చేసుకొని సెట్స్, షూటింగ్స్‌కు చిన్న బ్రేక్‌నిచ్చింది. ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇటీవలే హిందీలో ‘ఓ రామ్ కామ్’ అనే మూవీని ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
అటు తమిళంలో ‘రివాల్వర్ రీటా’ ఉండనే ఉంది. అదే ఇండస్ట్రీలో ‘కన్నివీడి’ అనే సినిమా కూడా కీర్తి చేతిలో ఉంది. ఇక తెలుగు ‘భోళా శంకర్’ తర్వాత ‘కల్కి’లో బుజ్జికి వాయిస్ ఇచ్చింది. ఆ తర్వాత మరో సినిమా అయితే చేయలేదు కానీ తాజాగా ఆమె ఓ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
‘రౌడీ జనార్దన’లో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్ ఎంపికైనట్టు టాక్ నడుస్తోంది. అయితే కీర్తి సురేశ్ హీరోయిన్‌గా ఎంపికైన విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.