ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు సరఫరా
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక నిఘా
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఈ ఏడాది జూలై ముందు వరకు నగరంలో ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా వాటి మూలాలు ధూల్‌పేట్‌తో ఉండేవి. గంజాయి, మత్తు పదార్థాల సరఫ రా, వినియోగం, విక్రయం ధూల్‌పేట్ కేం ద్రంగానే జరిగేవనే ప్రచారం ఉండేది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారులు జూలైలో ఆపరేషన్ ధూల్‌పేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్ర మం నేటికీ కొనసాగుతోంది.
ఇప్పటికే ధూల్‌పేట్‌లోని గంజాయి విక్రేతలు, సరఫరాదారులందరినీ అరెస్ట్ చేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమం తో ధూల్‌పేట్‌లో గంజాయి దందా తమ కంట్రోల్‌లోనే ఉందని ఇటీవల ప్రకటించా రు. కాగా, నగరంలో ఎక్సైజ్ అధికారుల నిఘా పెరగడంతో గంజాయి రవాణాదారులు రూటు మార్చారు.
నగరానికి వచ్చే గంజాయికి ఖమ్మంలో చెక్
నగరంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడం, గంజాయి నియంత్రణపై పోలీసులతో కలిసి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగడంతో గ్రేటర్‌లో ఇటీవల మత్తు పదార్థాల క్రయ, విక్రయాలు తగ్గాయి. ధూల్‌పేట్ కేంద్రంగా గంజాయి దందా సాగుతున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు ఏకంగా ఎక్సైజ్ సూపరిండెంట్ అంజిరెడ్డి అనే అధికారిని నియమిం చారు.
అక్కడ నిరంతరం కొనసాగుతున్న నిఘా, తనిఖీల్లో భాగంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రికార్డు స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి వ్యాపారులను అరెస్ట్ చేశారు. ధూల్‌పేట్‌లో దాదాపు 250 మంది గంజా యి వ్యాపారులున్నట్లు గుర్తించగా.. వారిలో దాదాపు 136 మందిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. 51 మంది పరారీలో ఉన్నా రు. ఈ నేపథ్యంలో ఈజీ మనీకి అలవాటు పడ్డ పలువురు అక్రమార్కులు రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా రైళ్లు, వాహనాల ద్వారా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు గంజాయిని తరలిస్తుండగా పలువురిని ఖమ్మం, హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారు లు అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఈ విషయంపై దృష్టి సారించిన ఎక్సైజ్ అధికారులు తెలంగాణ గుమ్మంగా ఉన్న ఖమ్మం లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఇటీవల రికార్డు స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడి నుంచి నగరానికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, కొంత కాలంగా ఖమ్మం మీదుగా వివిధ ప్రాంతాలకు తరలుతున్న 1065.13కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.