calender_icon.png 17 October, 2024 | 4:55 AM

ఎస్సెల్బీసీ పూర్తికి రూట్ మ్యాప్ సిద్ధం!

17-10-2024 02:30:54 AM

టన్నెల్ పనులు 2026 డిసెంబర్ కల్లా పూర్తి

ఎస్‌ఎల్‌బీసీకి 4,637 కోట్లు విడుదల

ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష

చెక్‌డ్యాంల నిర్మాణంపై విచారణ 

 హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను నీటిపారుదల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

బుధవారం జలసౌధలో దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్  పూర్తయితే అతిపెద్ద నీటిపారుదల టన్నెల్‌గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. మొత్తం 44 కి.మీ టన్నెల్‌లో 9.559 కి.మీ టన్నెల్ బోరింగ్ ఇంకా మిగిలి ఉందని తెలిపారు.

30 టీఎంసీల నీటి కోసం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని అందిస్తుందని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన కీలక భాగాలను దిగుమతి చేస్తామని నిర్మాణ పనులు చేస్తున్న జేపీ అసోసియేట్స్, దాని యూఎస్ భాగస్వామ్యులు మంత్రికి తెలిపాయి.

రూ. 4637 కోట్లు విడుదల..

ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ. 4637 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ ప్రకటించారు. టన్నెల్ లోంచి నీరు గ్రావిటీ ద్వారా ప్రవహిస్తుందని, దీంతో ప్రతిఏటా సుమారు రూ. 200 కోట్ల విద్యుత్తు ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెకుతో నల్గొండ జిల్లాకు చాలా మేలు జరుగుతుందన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు రూ. 440 కోట్లతో పూర్తవుతుందని, సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని మంత్రి వివరించారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. అలాగే నక్కలగండి ప్రాజెక్టుకూడా వేగంగా పూర్తవుతుందన్నారు. 

చెక్‌డ్యాములపై విచారణ..

 బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెక్‌డ్యాముల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరపాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇది పెద్ద కుంభకోణమని, విచారణ జరపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా తెలిపారు. ఆ సమయంలో నిర్మించిన అన్ని చెక్‌డ్యాములపై సమగ్ర విచారణ జరగాలని మంత్రి పునరుద్ఘాటించారు.

 సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ప్రాజెక్టుల ప్రాధాన్యతను తీసుకెళ్ళి భూసేకరణను వేగవంతం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువకు రిపేర్లు చేసి బలోపేతం చేయాలని  అధికారులను ఆదేశించారు. 

దేవరకొండ, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో 62,742 ఎకరాలకు సాగునీరు అం దించే కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపై చర్చిం చారు.  సమావేశంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, బి.లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, లిఫ్ట్ ఇరిగే షన్ సలహాదారు పెంటారెడ్డి, కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, పునరవాస కమిషనర్ వినయ్‌కృష్ణా రెడ్డి, ఈఎన్‌సీ అనిల్‌కుమార్, నల్గొండ సీఈ అజయ్ కుమార్, చిన్ననీటి పారుదల శాఖ సీఈ చంద్రశేఖర్, డీఎఫ్‌వో రాజశేఖర్,  అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ ఈఎన్‌సీ కే శ్రీనివాస్,  అధికారులు పాల్గొన్నారు.