22-04-2025 07:03:45 PM
పాల్వంచ (విజయక్రాంతి): ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం పట్టణంలోని షాన్ బాగ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం–వక్ఫ్ ఆస్తులపై జరుగుతున్న ప్రభుత్వ హస్తక్షేపాన్ని నిరసిస్తూ ప్రతిపాదిత సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సామూహికంగా పోరాడేందుకు రాజకీయ మద్దతును కూడగట్టడం. సమావేశంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, ముస్లిం మతపరమైన సంస్థల ప్రతినిధులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజ హక్కులను కాలరాయడమే కాకుండా, వక్ఫ్ ఆస్తుల స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు మాట్లాడుతూ... వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి ఆస్తిగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కూడా విలువైనవని, వాటి పరిరక్షణకు సమాజమంతా కలిసిరావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నాయకులు కూడా ఈ బిల్లుపై తమ పార్టీల స్థాయిలో చర్చించి వ్యతిరేకత ప్రకటించేందుకు అంగీకారం తెలిపారు. సమావేశం ముగింపులో, ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నది.
ఇందులో భాగంగా పాల్వంచలో వివిధ నిరసన కార్యక్రమాలు చేపడతామని తీర్మానించబడింది. ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు పాల్వంచ కన్వీనర్ ముర్తుజ అలీ ఖాన్, కో కన్వీనర్ మంజూర్ ఖాన్ ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షులు అబ్దుల్ రెహ్మాన్, కార్యదర్శి ఖాజా మీయా, కోశాధికారి గౌసుద్దీన్, సలహాదారు అబ్దుల్ రషీద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, డిసిసిబి చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సిపిఐ నాయకులు రాంబాబు, బండి నాగేశ్వరరావు, సిపిఎం నాయకురాలు సత్య, నిరంజన్, టిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, టీజేఎస్ నాయకులు దేవదానం తదితరులు పాల్గొన్నారు.