calender_icon.png 23 October, 2024 | 7:02 PM

రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు

10-07-2024 05:12:10 AM

  • శివారు ప్రాంతాలే టార్గెట్ 
  • ముఠాగా సంచరిస్తూ దొంగతనాలు 
  • భయం గుప్పిట్లో ప్రజలు

ఎల్బీ నగర్, జూలై 9: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అంతర్‌రాష్ట్ర దొంగలతో పాటు లోకల్ గ్యాంగ్‌ల కారణంగా ప్రజలు నిత్యం భయంతో జీవిస్తున్నారు. ఇల్లు విడిచి బంధువుల ఏదైనా ఊరికి వెళ్లాలంటే దొంగ ల భయంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పలు ముఠాలు రాత్రివేళల్లో మార ణాయుధాలతో సంచరిస్తున్నారని, పగటి వేళల్లో కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు.

పోలీస్ స్టేషన్లకు చాలా దూరం గా ఉండడం.. జన సంచారం కూడా తక్కువగా ఉండడంతో దొంగల ముఠాల కన్ను శివారు ప్రాంతాలపైనే ఉన్నది. సీసీ కెమెరాలు లేకపోవడం, పోలీసుల పెట్రోలింగ్, గస్తీ తక్కువగా ఉండడం మరో కారణం. నాగోల్, హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్ల పరిధిలోని శివారు కాలనీల ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా థార్, పార్థి దొంగల ముఠా సంచారం ఈ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది.  

దారి దోపిడీ ముఠా..

పార్థి గ్యాంగ్‌లో నలుగురు నుంచి ఏడుగురు ఉంటారు. వీరంతా రహదారులపై సం చరిస్తూ దోపిడీలకు పాల్పడుతారు. వాహనాలను అపహరించడం, రాత్రివేళలో రోడ్లపై నిలిపి ఉన్న వాహనాల్లో నిద్రపోతున్న డ్రైవర్లను బెదిరించి నిలువు దోపిడీ చేస్తారు. వీరి ఆయుధాలు స్క్రూ డ్రైవర్లు, చిన్నచిన్న కత్తు లు. మొదటగా టార్గెట్ చేసినవారిని తీవ్రం గా గాయపరిచి దోచుకుంటారు. ఎదురు తిరిగితే చంపుతారు. ఇటీవల విజయవాడ జాతీ య రహదారిపై చోరీలు చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన పలు హత్య కేసులను విచారించిన పోలీసులు పార్థి గ్యాంగ్ చేసినట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి నెల రోజులుగా నిఘా పెట్టారు. ఈ నెల 5న పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డులో నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. పార్థి గ్యాంగ్ దొంగ లు పోలీసులపైనే దాడులకు తెగపడ్డారు. పోలీసులు గాల్లో కాల్పులు జరపడంతో లొంగిపోయారు.

తాళం వేసిన ఇండ్లే టార్గెట్

థార్ గ్యాంగ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. వీరు ముగ్గురు నుంచి పది మంది గుంపుగా సంచరిస్తూ దొంగతనాలు చేస్తారు. మొదటగా మారణాయుధాలతో దాడి చేస్తారు. అడ్డుకుంటే చంపడానికి సిద్ధంగా ఉంటారు. గేటెడ్ కమ్యూనిటీ, శివారు ప్రాంతాలే టార్గెట్. పగటి వేళల్లో ఆటోలో ప్రయాణికుల మాదిరిగా కాలనీల్లో సంచరిస్తూ రెక్కి నిర్వహిస్తూ దొంగతనానికి అనువుగా ఉన్న ఇండ్లను గుర్తిస్తారు. తాళం వేసిన ఇల్లు కనిపించిందా ఇక అంతే. అదే రోజు రాత్రివేళ దొంగతనం జరగాల్సిందే. ఒంటరిగా ఉన్న ఇల్లు ఉంటే పగటిపూటసైతం చోరీకి పాల్పడతారు. ఈ ముఠా ఇటీవల హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్‌మోహర్, ప్రజయ్ విల్లాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. అదే విధంగా ప్రియదర్శిని కాలనీలో తాళం వేసిన ఇంట్లో రాత్రి వేళ చోరీ చేసి 35 తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగతనం చేశారు.  

నిరంతర గస్తీ..

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయాల్లో శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్, గస్తీ చేపడుతున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకోవాలి. రాత్రివేళల్లో విద్యుత్తు దీపాలు వెలిగేలా చూసుకోవాలి. ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇస్తే గస్తీ సైతం ఏర్పాటు చేస్తాం. ఆపద సమయాల్లో 100 లేదా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ 87126 62640 నంబర్లకు ఫోన్ చేయాలి.  

 రామకృష్ణ, సీఐ, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్