calender_icon.png 17 October, 2024 | 10:48 PM

మద్యం పర్మిట్ రూంలో కుళ్లిన ఆహారం

17-10-2024 07:54:20 PM

మద్యం షాప్ ఎదుట మందు బాబుల ఆందోళన

మందమర్రి,(విజయక్రాంతి): మద్యం షాపులకు అనుసంధానంగా పర్మిట్ రూంలకు అనుమతించిన ప్రభుత్వం మందు బాబులు బయట మద్యం సేవించకుండా పర్మిట్ రూంలలోనే మద్యం సేవించే వెసులుబాటు కల్పించింది. ఇదే అదనుగా బావించిన మద్యం దుకాణం యజమానులు పర్మిట్ రూం నిర్వాహకులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన ఆహారాన్ని అమ్ముతు మందు బాబులను నిలువునా ముంచుతున్నారనే  ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మద్యం పర్మిట్ రూంలో నాణ్యత లేని కుళ్లిన ఆహారాన్ని అమ్ముతున్నారని మందుబాబులు ఆందోళనకు దిగిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ లోని కనకదుర్గా మద్యం దుకాణంలో పలువురు ముందు బాబులు మద్యం కొనుగోలు చేసి పర్మిట్ రూంలో సేవించేందుకు వెళ్ళారు. ఈ క్రమంలో మందులోకి చికెన్ ఆర్డర్ చేయడంతో పర్మిట్ రూం నిర్వాహకులు చికెన్ అందించారు.

చికెన్ ముక్క నుండి కుళ్లిన వాసన రావడంతో వినియోగదారులు పర్మిట్ రూం నిర్వహకున్ని నిలదీశారు. రెండు మూడు రోజులుగా నిలువ ఉంచిన చికెన్ వినియోగదారులకు అమ్ముతున్నరని నిలువ ఉంచిన చికెన్ కుళ్లి పోయి దుర్వాసన వస్తుందని మందు బాబులు ఆందోళన చేపట్టారు. దీనిపై పర్మిట్ దుకాణం నిర్వాహకులు చికెన్ కుళ్లి పోలేదని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన మందు బాబులు సదరు మద్యం దుకాణం ఎదుట ఆందోళన చేపట్టి పర్మిట్ రూం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మద్యం దుకాణం పర్మిట్ రూంలో కుళ్లిన ఆహార పదార్థాలు అమ్ముతూ మందుబాబులను నిలువునా ముంచడమే కాకుండా వారి ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారని వెంటనే అధికారులు స్పందించి పర్మిట్ రూం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మందు బాబుల ఆందోళన సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు కుళ్లిన ఆహారాన్ని పరిశీలించి నిర్వాహకునికి జరిమాన విధించారు.

నాణ్యత లేని ఆహారంపై మున్సిపల్ అధికారుల జరిమాన

మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ వైన్ షాప్ పక్కనగల కుమార్ పర్మిట్ రూంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగదారులకు విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి షాప్ యజమాని 2000 జరిమాన విధించారు. ఈ  కార్యక్రమంలో సానిటరి ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, హెల్త్ అసిస్టెంట్ ఎండి సమీర్ ఇన్చార్జి మేనేజర్ పి.కృష్ణ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బంగారు శ్రీనివాస్, బిల్ కలెక్టర్ బూర్ల లింగయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.