20-02-2025 01:13:24 AM
కామారెడ్డి/జగిత్యాల/నిర్మల్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్‌లో కొత్త, పాత క్యాడర్ కలువడం లేదు. అసెం బ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మా జీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అప్ప టికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి, వలస నేతలు, క్యాడర్‌కు సఖ్యత కుదరడం లేదు.
పైకి అందరూ కాంగ్రెస్‌లో ఉన్నట్టు కనిపించినా ఎవరికీ వారే యమునతీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల నేతలు, క్యాడర్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈవిషయంలో అధిష్ఠానం చూసీచూడనట్టుగా ఉం డటంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
బాన్సువాడ జగడాలు..జూపల్లికి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి పై బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఆ త ర్వాత పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి.
పాత క్యాడర్‌లో రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అనుచరులు మాత్రమే పోచారానికి అ నుకూలంగా మారారు. మిగ తా వారంతా ఏనుగు రవీందర్‌రెడ్డి వైపే ఉన్నారు. గత పదేళ్లుగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన తనయులు భాస్కర్ రెడ్డి, సురేందర్‌రెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్‌ను బీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తూ అనేక కేసులు పెట్టించి వేధించారని ఆరోపణలున్నాయి.
ఈనేపథ్యంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పోచా రం వర్సెస్ ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గాలుగా చీలిపోయింది. రవీందర్‌రెడ్డి తన వర్గీయులతో కలిసి గాంధీభవన్‌కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకే కాదు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సైతం పోచారంపై ఫిర్యాదు చేశా రు.
అయినా అధిష్ఠానం ఏ చర్యలు తీసుకోకపోవడంతో రెండు వర్గాల విభేదాలు తారా స్థాయికి చేరాయి. మార్కెట్ కమిటీ పదవుల్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్థానిక ఎమ్మె ల్యే కావడంతో ఆయన ప్రతిపాదించిన వారి కే పదవులు దక్కాయి. బాన్సువాడ పాలకవర్గం మాత్రమే రవీందర్‌రెడ్డి ప్రతిపాదించిన వారికి దక్కింది.
ఇటీవల వర్ని పోలీసుల విధులకు ఆటంకం కల్గిస్తున్నారనే ఆరోపణలపై 28 మంది రవీందర్‌రెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. పోచారం ఆదేశాల మేరకే కేసులు నమోదు చేశారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లికి రవీందర్‌రెడ్డితో పాటు బాధితులు ఫిర్యాదు చేశారు. పోచా రం వ్యవహరం పార్టీ పెద్దల దృష్టికి రావడం తో ఇన్‌చార్జి మంత్రి జూపల్లి ఈ విషయం లో సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు.
‘సంజయ’కు ప్రాధాన్యం.. ‘జీవన’ సంగ్రామం
మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మునుపెన్నడూ లేని వర్గపోరును ఎదుర్కొంటున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఓడిపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు తగిన గుర్తింపు లభిస్తుందని భావించారు. అయితే బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి తగినంత ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడాన్ని జీవన్‌రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయనకే తెలియకుండా సొంత నియోజకవర్గంలో సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్పించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
దీంతో అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సీనియర్ మంత్రులు, నాయకులు సముదాయించినా ఇప్పటివరకు జీవన్‌రెడ్డి, సంజ య్‌కుమార్ మధ్య సయోధ్య కుదరకపోగా విభేదాలు తీవ్రమయ్యాయి. ఈక్రమంలో జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణహత్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఈ ఘటనకు పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కారణమంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. తన అనుచరుడి హత్యకు పోలీసుల నిర్లక్ష్యం కూడా కారణమని ఆరోపణలు చేశారు. ఇక నియోజకవర్గంలో మార్కెట్ కమిటీల నామినేటెడ్ పోస్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
నివురుగప్పిన నిప్పులా నిర్మల్..
నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన శ్రీహరిరావు ఎన్నికల తర్వాత డీసీసీ అధ్యక్షుని హోదాలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో మాజీమంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్య వర్గపోరు ప్రారంభమైంది.
అల్లోల్ల చేరికను మొదటి నుంచి శ్రీహరిరావు వ్యతిరేకించినా..అధిష్ఠానం మాత్రం ఆయన్ను పార్టీలో చేర్చుకుంది. డీసీసీ అధ్యక్షుడి హోదాలో శ్రీహరిరావు చేసే కార్యక్రమాలకు అల్లోల్ల పెద్దగా హాజరుకావడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆభ్యర్థి నరేందర్‌రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఇద్దరు నేతలు డుమ్మా కొట్టడం గమనార్హం.
వీరిద్దరి మధ్య విభేదాలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్కకు తలనొప్పిగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే రేఖశ్యాంనాయక్ మధ్య, ముధోల్ నియోజకవర్గంలో నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులు.