మాజీ క్రికెటర్ పాంటింగ్
దుబాయ్: టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డు (టెస్టు క్రికెట్)ను ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ బద్దలు కొట్టే అవకాశముందని ఆసీస్ మాజీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. రూట్ ఇటీవలే టెస్టుల్లో 12 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. అయితే 12వేల మార్క్‌ను అందుకోవడానికి రూట్‌కు కేవలం 143 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే అవసరమయ్యాయి. రూట్ ఖాతాలో 32 సెంచరీలు, 63 అర్థశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం రూట్ వయస్సు 33 సంవత్సరాలు కావడంతో.. అతడు కనీసం మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడే అవకాశముందని పాంటింగ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో మాస్టర్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసే చాన్స్ రూట్ ముంగిట ఉందని పాంటింగ్ తెలిపాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200 టెసుల్లో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. ఇక పాంటింగ్ 13,378 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.