calender_icon.png 30 October, 2024 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్ దంచెన్..

28-06-2024 02:49:36 AM

  • ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ 
  • పంత్, కోహ్లీ విఫలం

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ సజావుగా జరిగేందుకు వీలు లేకుండా పోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సూపర్ ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకున్న రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై అదే జోరును కొనసాగించాడు. ఇక సెమీస్‌లో విజృంభిస్తాడనుకున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 

గయానా: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మెరిశాడు. సూపర్ ఆస్ట్రేలియాపై 92 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ మరువక ముందే మరో భారీ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ౭ వికెట్ల నష్టానికి   ౧౭౧ పరుగులు చేసిం ది. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. సూర్య (36 బంతు ల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ 2, రీస్ టోప్లీ, ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.

దక్కని శుభారంభం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మరోసారి శుభారంభం దక్కలేదు. సెమీస్‌లో రాణిస్తాడనుకున్న కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఆరంభం నుంచి ఇబ్బందిగా కదలిన కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేసి రీస్ టోప్లీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ గా వెనుదిరిగాడు.  4 పరుగులు మాత్రమే చేసిన పంత్ సామ్ కరన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్.. రోహిత్‌తో కలిసి బ్యాట్ ఝలిపించాడు.

తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీతో మెరిసిన రోహిత్ ఆ వెంటనే ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆపై జోర్డాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విఫలమైన సూర్యకుమార్  కెప్టెన్‌ను అనుసరించాడు. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23) ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నాడు. అయితే చివర్లో జడేజా (౯ బంతుల్లో ౧౭ నాటౌట్), అక్షర్ పటేల్ ( ౬ బంతుల్లో ౧౦) కాసిన్ని పరుగులు చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

కోహ్లీ ఎందుకిలా?

ఐసీసీ టోర్నీలంటే విరగబడి పరుగులు చేసే కోహ్లీ బ్యాట్ ఇప్పుడు పూర్తిగా మూగబోయింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తాడనుకుంటే వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో మంచి రికార్డు కలిగిన కోహ్లీ కనీసం అర్థశతకం మార్క్ అందుకోలేకపోయాడు. 1, 4, 0, 24, 37, 0.. ఇవి వరల్డ్‌కప్‌లో కోహ్లీ సాధించిన స్కోర్లు. ఇది చూస్తుంటే అసలు ఆడుతుంది కోహ్లీనేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది.

ఓపెనర్‌గా జైస్వాల్‌ను ఆడించి కోహ్లీని వన్‌డౌన్‌లో పంపించాల్సింది. కానీ జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఎందుకో ఈ విషయంపై దృష్టి సారించలేదు. వాస్తవానికి కోహ్లీ మూడోస్థానంలో వచ్చి ఎక్కువ పరుగులు సాధించాడన్న విషయం గుర్తు ఎరగక మానదు. 2014 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ బ్యాటింగ్ ఈసారి మాత్రం పూర్తి విరుద్ధంగా సాగింది. సెమీఫైనల్లో కోహ్లీ ఇలా విఫలం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.