గ్రాస్ ఐస్లెట్ (సెయింట్ లూసియా): టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అజేయంగా సెమీఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన రోహిత్ సేన.. సూపర్ సేమ్ సీన్ రిపీట్ చేసింది. గ్రూప్ భాగంగా సోమవారం జరిగిన తమ చివరి సూపర్ పోరులో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో ఆస్ట్రేలియా ఆకట్టుకోలేకపోయింది. వర్షం కారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై మొదట భారత స్టార్లను కట్టడి చేయడంలో తడబడ్డ కంగారూలు.. ఆనక ఛేదనలోనూ తడబడ్డారు.
టీమిండియాకు కొరుకుడు పడని కొయ్యలా మారిన ట్రావిస్ హెడ్ మరోసారి రెచ్చిపోయినా.. కీలక సమయాల్లో వికెట్లు తీసిన టీమిండియా పైచేయి సాధించింది. ఇక ఆసీస్ భవితవ్యం అఫ్గాన్, బంగ్లా మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిందే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆలరించగా.. సూర్యకుమార్ యాదవ్ (31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబే (28; 2 ఫోర్లు, ఒక సిక్సర్), హార్దిక్ పాండ్యా (27 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) మరోసారి నిరాశ పర్చగా.. రిషబ్ పంత్ (15; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టొయినిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 76; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి భారత్‌పై విశ్వరూపం కనబర్చగా.. మిషెల్ మార్ష్ (37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (20; 2 ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త పోరాడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టారు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రోహిత్ ధనాధన్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. మెగాటోర్నీలో వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ.. విరాట్ రెండోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరు పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. అయితే ఇదేది పట్టించుకోని రోహిత్ శర్మ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోలేడనే అపవాదు పక్కన పెట్టి.. స్టార్క్ బౌలింగ్‌లో రోహిత్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స మూడో ఓవర్‌లో రోహిత్ వరసగా 6,6,4,6,6తో కదంతొక్కాడు. దీంతో ఏకంగా 29 పరుగులు రాగా.. ఐదో ఓవర్‌లో 6,4,4 కొట్టిన రోహిత్ 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
ఐదు ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 52/1 కాగా.. అందులో రోహిత్ 50 పరుగులు చేయడం విశేషం. మధ్యలో మ్యాచ్‌కు వర్షం కాస్త ఆటంకం కలిగించినా.. రోహిత్ తుపాను మాత్రం ఆసీస్‌ను ముంచెత్తింది. స్టొయినిస్ ఓవర్‌లో రోహిత్ 4,6,6 అరుసుకోగా.. వేగంగా ఆడే క్రమంలో పంత్ ఔటయ్యాడు. రోహిత్‌కు సూర్యకుమార్ తోడవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు కాగా.. తొమ్మిదో ఓవర్‌లోనే భారత జట్టు స్కోరు వంద పరుగులు దాటింది.
స్టొయినిస్ ఓవర్‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ సెంచరీ చేయడం ఖాయమే అనుకుంటే.. స్టార్క్ వేసిన చక్కటి యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే సూర్యతో పాటు దూబే, పాండ్యా తలా కొన్ని పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించారు. హిట్‌మ్యాన్ వేసిన పునాదిపై మనవాళ్లు మరింత భారీ సౌదం నిర్మిస్తారని ఆశించినా.. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కట్టిపడేశారు. ముఖ్యంగా హజిల్‌వుడ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.