calender_icon.png 15 January, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంక పోరుకు రోహిత్, కోహ్లీ దూరం

09-07-2024 12:58:16 AM

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా సీనియర్ విరాట్ కోహ్లీ లంకతో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించడం కోసం బీసీసీఐ ఈ ఇద్దరికి విశ్రాంతినిచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 నేపథ్యంలో టీమిండియా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. రెండుసార్లు ఫైనల్ చేరినప్పటికీ ట్రోఫీని అందుకోవడంలో విఫలమైన భారత్ ఈసారి మాత్రం డబ్ల్యూటీసీ టైటిల్ ఒడిసిపట్టాలని చూస్తోంది.

టీమిండియా సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు.. ఆపై న్యూజీలాండ్‌తో మూడు టెస్టులు.. అనంతరం ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్ ట్రోఫీలో ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో ఆడనుంది. ‘ రానున్న ఆరు నెలల్లో టీమిండియా 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. డబ్ల్యూటీసీ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ పూర్తిస్థాయిలో టెస్టులపై దృష్టి సారించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దానికి ముందు ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఈ ఇద్దరు అందుబాటులోకి వస్తారు. ఎంతో అనుభవమున్న రోహిత్, కోహ్లీలకు ఈ ప్రాక్టీస్ సరిపోతుందనుకుంటున్నాం’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.