ఒలింపిక్స్‌లో ముగిసిన భారత్ టెన్నిస్ పోరాటం
పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడలో భారత టెన్నిస్ పోరు ఒక్కరోజుకే పరిమితమైంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నాగల్.. డబుల్స్‌లో రోహన్ బోపన్న శ్రీరామ్ బాలాజీ జంట తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు. సోమవారం పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్‌లో బోపన్న జంట 5-7, 2-6తో రోజర్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో బోపన్న తన అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు మ్యాచ్ అనంతరం స్పష్టం చేశాడు. ‘ఇండియన్ జెర్సీలో నా ఆఖరి మ్యాచ్ ఆడేశాను. ఇంతకాలం సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నాడు.
రికార్డు స్థాయిలో నాలుగో ఒలింపిక్స్ ఆడుతున్న రోహన్ బోపన్న విశ్వక్రీడల్లో కచ్చితంగా పతకం తెస్తాడని ఆశించినప్పటికీ నిరాశపరిచాడు. అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో మాథ్యూ ఎబ్డెన్‌తో జత కట్టే బోపన్న.. ఒలింపిక్ నిబంధనల ప్రకారం భారత్ ఆటగాడిని జోడీగా ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో శ్రీరామ్ బాలాజీతో జత కట్టిన బోపన్న తన చివరి ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమయ్యాడు. ఇక రెండోసారి ఒలింపిక్స్ ఆడుతున్న నాగల్ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన కోరెన్‌టిన్ మౌటెట్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
అయితే టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌కు చేరి సంచలనం సృష్టించిన సుమిత్ ఈసారి మాత్రం తొలి రౌండ్‌కే పరిమితమయ్యాడు. దీంతో పారిస్ క్రీడల్లో భారత టెన్నిస్ పోరాటం ముగిసినట్లయింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో లియాండర్ పేస్ కాంస్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.