calender_icon.png 31 January, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయలలో రాతిచిత్రాల స్థావరాలు

26-01-2025 01:30:19 AM

  1. గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బుర్ర సంతోష్
  2. పదివేల ఏళ్ల కిందటివిగా నిపుణుల అభిప్రాయం

మెదక్, జనవరి 25 (విజయక్రాంతి): కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బుర్ర సంతోష్ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలోని.. నాగసానిపల్లె, ఏడుపాయల దుర్గమ్మ మార్గంలో నాగసానిపల్లెగుట్టలలో 18.007378 డిగ్రీల రేఖాంశాలు, 78.182086 డిగ్రీల అక్షాంశాలపై  రెండుచోట్ల మూడు రాతిచిత్రాల తావు  అపురూపమైన, అరుదైన రాతిచిత్రాలను గుర్తించాడని కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

ఈ ఎరుపురంగు రాతిచిత్రాలలో రంగునింపిన పెద్దబొమ్మ, ఒక చేప, మచ్చల జంతువులు, పెద్ద సూర్యుడు, ఎముక, రెండు కంగారువంటి జంతువులు, మాస్కు ధరించిన ఒక పెద్ద మానవరూపం, వజ్రాకార డిజైన్, జిగ్‌జాగ్ గీతలు, నిలువుగీతల డిజైన్లు, పెద్దతోక. పెద్దమెడ, పెట్టెవంటి శరీరం డైనోసార్ వలె కనిపించే ఒక బృహద్రూప మాంసాహార జంతువు..  కొన్ని గుర్తించబడని చిత్రాలున్నాయి.

దాదాపు రాతిచిత్రాలన్నీ ఔట్‌లైన్ స్కెచెస్ లాగానే కనిపిస్తున్నాయి. కొన్ని చిత్రాలు అధ్యారోపణం(ఓవర్ లాపింగ్) చేయబడ్డా  రంగులు నింపడం, నైరూప్య చిత్రాలు ఈ రాతిచిత్రాల శైలి, ఎరుపురంగులో చిత్రించబడ్డ పద్ధతి వీటి కాలాన్ని చివరి మధ్య  పదివేల సంవత్సరాల కిందటివిగా గుర్తించవచ్చని రాతిచిత్రాల నిపుణు  కొత్త తెలంగాణ చరిత్ర బృందం సలహాదారులు బండి మురళీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.