calender_icon.png 26 December, 2024 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాకితల్లి

23-09-2024 12:00:00 AM

ఫణికుమార్ :

ఒక ఇంటిముందు ఒక గోండు మహిళ తన పాపతో కూర్చుని తృప్తిగా ఎటో చూస్తోంది. ఇంట్లో తిండిగింజలు లేకపోయినా మాతృత్వమిచ్చే హాయి ఆమె మొహమంతా నిండి వుంది. ఈ క్షణాన్ని శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు వీలుగా ఒక ఫొటో దూరం నుండి తీశాను. ఫొటో నేను అనుకున్న దానికంటే అందంగా వచ్చింది. 

ఒక గోండు తెగవారు ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చి కమలాపురం రేయాన్స్ ఫ్యాక్టరీ దగ్గర గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారనీ, వరదలలో వాళ్ళ ఇళ్ళు దెబ్బ తిన్నా ఎవరూ వారికి సహాయం చేయటానికి వెళ్ళలేదనీ ఎవరో చెప్పారు. ఒరియా గోండీ భాషలు కలిసిన మణి ప్రవాళం వారు నిత్యం మాట్లాడే భాషట. వాళ్ళేం చెబుతున్నారో అర్థం కాకపోవడానికీ తత్కారణంగా వారికీ సమయంలో సహాయం అందక పోవటానికి యిది కూడా కారణమై వుండవచ్చు.

ఆ సాయంకాలం అలవాటు ప్రకారం నా నోటు బుక్కు కెమెరా తీసుకుని ఈ గూడేనికి వెళ్లాను. వరదలలో వారు నష్టపోయిన మాట నిజం. వారు దాచుకున్న కొన్ని తిండిగింజలూ తినడానికి పనికి రాకుండా తడిసిపోయాయి. రేయాన్స్ ఫ్యాక్టరీ మూత పడటంతో ఎవరికీ పని లేదు. వరదలలో పెద్ద పెద్ద రైతులే నష్టపోగా ఇక పొలం పనులకు పిలిచి కూలీ ఇచ్చే నాథుడే లేడు. స్థితి దయనీయంగా వుంది.

నేను చూసిన విషయాలూ, అక్కడి పరిస్థితులూ, నోటు బుక్కులో రాసుకుని, అక్కడి పరిస్థితిని ఫొటోలు కూడా తీశాను. ఇలాంటి ఫొటోలు నా దగ్గర వున్నంత కాలం పొరపాటున కూడా ఈ పరిస్థితులు మరచిపోవడానికి వీల్లేదు. ముందు భారీ వర్షం వల్ల కూలిపోయిన ఇళ్ళు కట్టించే ప్రయత్నాలు చేయాలి. ఇళ్ళు ఈ గిరిజనులతోనే కట్టిస్తే ఇళ్ళు పూర్తయేంత వరకు వారికి చేతినిండా పని. తరువాత ఏం చేయాలో వారినే అడిగి వారి సలహాలన్నీ రాసుకున్నాను. అలా రాసుకున్న తరువాత ఆ గూడెమంతా తిరిగాను. ఒక ఇంటిముందు ఒక గోండు మహిళ తన పాపతో కూర్చుని తృప్తిగా ఎటో చూస్తోంది. ఇంట్లో తిండిగింజలు లేకపోయినా మాతృత్వమిచ్చే హాయి ఆమె మొహమంతా నిండి వుంది. ఈ క్షణాన్ని శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు వీలుగా ఒక ఫొటో దూరం నుండి తీశాను. ఫొటో నేను అనుకున్న దానికంటే అందంగా వచ్చింది. నా పని పూర్తి చేసుకొని నాగారం వెళ్ళిపోయాను.

వాళ్ళకు ఇళ్ళ కాలనీ ఇవ్వడానికి ఐ.టి.డి.ఏ. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ శుభవార్త చెప్పడానికీ, వారిని కార్యోన్ముఖులుగా చేయడానికీ ఆ గూడెం మళ్ళీ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఎన్‌లార్జ్ చేసిన ఈ ఫొటో కూడా నా వెంట తీసుకెళ్ళాను. ఈ వార్త చెప్పగానే పండుగ వాతావరణం వచ్చింది. ఆ అమాయకుల ఇళ్ళలో.

ఈ ఫొటో రాకి (ఆ తల్లిని అందరూ రాకీ అని పిలుస్తున్నారు) కివ్వగానే, ఆమె ఫొటో చూడక ముందే అందరూ లాక్కుని గలగలా నవ్వుతూ 

“మా ఫొటోలు కూడా తీయరా?” అని అడిగారు. అలాగే తీస్తానని మరి కొందరి ఫొటోలు తీశానా రోజున.

కొందరు ఆదివాసుల సంతోషానికి పరోక్షంగానైనా కారణమయ్యానన్న సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాను. మళ్ళీ ఆ ఫొటో ఇంకొకసారి చూస్తే ఆ మాతృత్వం ఎంతో బాగా చిత్రితమమైందనిపించింది. ఆ ఫొటోని ఎన్‌లార్జ్ చేసి అఖిల భారతస్థాయి ఫొటో ఎగ్జిబిషన్‌లకు ‘మదర్ అండ్ ఛైల్డ్’ అనే శీర్షికతో పంపాను. రెండు ఎగ్జిబిషన్లలో ప్రైజులొచ్చాయి. నన్ను ఆమెచ్యూర్ ఫొటోగ్రాఫర్ల కుటుంబంలో సభ్యునిగా చేశాయి. ఈ పొటోని ఎన్‌లార్జ్ చేసిన కాపీని ఇంట్లో వుంచుకున్నాను గుర్తుగా.

తర్వాత ఆ గూడెం ఎప్పుడు వెళ్ళినా రాకిని, ఆమె పాపని తప్పకుండా కలిసి వారి క్షేమ సమాచారాలు తెలుసుకునే వాడిని. ఆ ఫొటోకు వచ్చిన మెడల్స్ కూడా ఆమెకు చూపాను. ఫొటోగ్రాఫ్‌ల పోటీ అంటే ఏమిటో వివరించి చెప్పాను. ఈ బహుమతులను చూడగానే గూడెంలోని గిరిజన స్త్రీలందరూ

“మా ఫొటోలు కూడా పోటీలకు పంపరా?” అని అమాయకంగా అడిగారు. 

“అలాగే పంపుతాను. మీరుకూడా రాకీలాగే బుద్ధిగా మీ పనులు చేసుకుంటే..” అని చెప్పాను.

అప్పట్నుంచి లోగడకంటే శ్రద్ధగా పని చేయడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడూ పోటీలకు 

“మా ఫొటోలు పంపుతున్నారా?” అని అడిగితే,

“పోటీలు ఇప్పుడప్పుడే లేవు. వున్నప్పుడు నేనే పంపుతాను. మీరు గుర్తుచేయనవసరం లేదు” అని చెప్పేవాడిని. కష్టించి పనిచేసే వారందరికీ ఈ ఫొటోల కబుర్లు వినడం ఎప్పుడూ సరదాగానే వుండేది. ‘కెమేరా ఎలా పనిచేస్తుంది’ అనీ. 

“మాకు కెమెరా కొనిపెట్టరా?” అని అప్పుడప్పుడూ అడిగేవారు. 

“కెమెరా మీరు కొంటే ఇతరుల ఫొటోలు తీయవచ్చు కానీ, మీ ఫొటోలు మీరే ఎలా తీసుకోగలరు? అందుచేత మీరు శ్రద్ధగా పనిచేస్తే మీ ఫొటోలు నేనే తీసిపెడతాను” అన్నాను వారితో! 

కష్టపడి పని చేసే వారిని చూడడం నాకెంత సంతోషాన్నిచ్చేదో నా కెమెరాను చూడడం వారికి అంత సరదాగానే వుండేది.

కొన్ని వారాల తరువాత ఒకరోజు మధ్యాహ్నం ఏటూరు నాగారం ఐ.టి.డి.ఏ.లో కూర్చుని పని చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ఆఫీసులోకి దూసుకొచ్చారు ఈ గూడెం వాసులు. 

“అయ్యా! ఆగమై పోయింది..” అని గుండెలు పగిలేలా ఏడుస్తూ నన్ను కావలించుకున్నారు. నాకూ వారి పరిస్థితి చూడగానే జరగకూడనిదేదో జరిగిందని అర్థమయింది. ‘ఏ దుర్వార్త వినవలసి వస్తుందో’ అని ఏం జరిగిందని అడగలేదు.

“రాత్రి గూడెంపై రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి. గొడవ విని అందరం లేచి ఎలుగుబంట్లని తరిమివేసే లోపు జరగకూడనిది జరిగిపోయింది. బయట తిరుగుతున్న రాకీని పట్టుకుని మొహం, వక్షస్థలం రక్కి కొరికి నానా భీభత్సం చేశాయి. ఆమెకు మొహమన్నది లేదిప్పుడు. గూడెంలో స్పృహ తప్పి పడుంది” అన్నారు.

బాధ కారణంగా కలిగిన నిష్క్రియా పరత్వం నన్ను పూర్తిగా ఆవహించక ముందే జీపులో ఆమెనూ, ఆమెకు సంబంధించిన వాళ్ళనీ వరంగల్ ఎమ్.జి.ఎమ్. ఆస్పత్రికి పంపాను. అక్కడి సూపరిండెంటు గారికి వర్తమానం పంపాను, ఫలానా వాళ్ళు వస్తున్నారనీ సహాయం చేయమనీ-. వరంగల్ ఆస్పత్రిలో డాక్టర్లు ఎంతో కష్టపడి ఆమె ప్రాణాలు కాపాడారు. కొన్ని రోజుల తరువాత ఆ గూడెం వారు ప్రమాదం గడిచి పోయిందని, అయితే ఇంటికి తిరిగి వచ్చిన రాకి మొహంలో చాలా భాగం లేదనీ చెప్పారు. 

“మిమ్మల్ని కూడా గుర్తు చేస్తోంది. మీరెప్పుడొస్తున్నారు?” అని అడిగారు. 

వారున్న ప్రదేశం ఐదారు కిలోమీటర్ల దూరంలోనే వున్నా ‘వీలు చూసుకుని వస్తానని’ ముక్తసరిగా సమాధానం చెప్పి వాళ్ళని పంపేశాను. కానీ, ఆ గ్రామం మళ్ళీ వెళ్ళనే లేదు.

ఆ గూడెంలో పునరావాస కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చి నాకు ఫొటోగ్రఫీలో రెండు బహుమతులు రావడానికి కారణమైన ఆ తల్లిని చూసే ధైర్యం లేకపోయింది. ఆ క్షణంలో నా ఎరుకలోనే ఎలుగుబంట్ల దాడికి ప్రాణాలు కోల్పోయిన ఎందరో గిరిజన తల్లులను, అనాధలైన వారి పిల్లలను స్మరించే సాహసం కూడా చేయలేకపోయాను.

(‘గోదావరి గాథలు’ నుంచి..)