calender_icon.png 12 March, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలింపు చర్యల్లో రోబోలు

12-03-2025 12:00:00 AM

నేటి నుంచి వాటితోనే రెస్క్యూ ఆపరేషన్

మాస్టర్ రోబో ఇన్‌స్టాలేషన్ పూర్తి

తుది దశకు సహాయక చర్యలు

నాగర్‌కర్నూల్, మార్చి 11 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. మంగళవారం మాస్టర్ రోబో యంత్రాన్ని ఆక్వా రోబో నిపుణుల బృందం సొరంగం వద్ద ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేశాయి. మూడు రోబో యంత్రాల ద్వారా డేంజర్ జోన్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ప్రక్రియ కొనసాగించనున్నారు. ప్రస్తుతం సొరంగంలోని 13.6 కి.మీ.ల వద్ద డీఏ1 మరో కొద్ది దూరంలో డీd-2 ప్రాంతంలో రెస్క్యూ బృందాలు సుమారు 6 నుంచి 8 మీటర్ల వరకు తవ్వకాలు జరిపాయి. గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరికిన ప్రదేశంలోనే మరో ముగ్గురు కార్మికుల ఆనవాళ్లు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఆ ప్రదేశంలో టీబీఎం యంత్రాన్ని ప్లాస్మా, గ్యాస్ కట్టర్ల ద్వారా వేరు చేస్తూ లోకో ట్రైన్ ద్వారా విడిభాగాలను బయటికి తరలిస్తున్నారు. మరికొద్ది దూరం తవ్వకలు జరిపితే నీటి ఊట కారణంగా మట్టిదిబ్బలు కూలే ఆస్కారం ఉందని టైగర్ కాగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఒక్కో మీటర్ దూరంలో కూలే ప్రదేశం ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతం వరకు భారీ కర్రలతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. డేంజర్ జోన్ వద్ద రోబో యంత్రాలను తవ్వకాల కోసం వినియోగిస్తూ బయట నుంచి మాస్టర్ రోబో ద్వారా మానిటరింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

సుమారు 12 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెస్క్యూ బృందాలతో పాటు మరో నాలుగు ప్రైవేటు ఏజెన్సీలతో కూడిన సుమారు 580 మంది రెస్క్యూ టీం సభ్యులు నిర్విరామంగా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఒక్కో షిఫ్టులో సుమారు 110 నుంచి 120 మంది నాలుగు షిప్ట్‌లుగా సొరంగంలోకి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఒక్కో షిఫ్ట్‌లో సుమారు 12 నుంచి 14 గంటల దాకా సొరంగంలోనే పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వం తాగు నీటితోపాటు భోజన వసతి కూడా సొరంగంలోనే ఏర్పాటు చేసింది.