07-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): తెలంగాణ వైద్యరంగంలో విప్లవాత్మక ముందడుగుగా, మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రాష్ట్రంలోని మొట్టమొదటి శస్త్రచికిత్సా రోబోటిక్ వ్యవస్థ ఎస్‌ఎస్‌ఐ మంత్రా 3.0ను గురువారం విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మల్లారెడ్డి యూనివర్సిటీ చాన్స్‌లర్ సీ కల్పనరెడ్డి, యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చాన్స్‌లర్ కల్పనరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి శస్త్రచికిత్సా రోబోటిక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందన్నారు.
అత్యంత ఖచ్చితంగా, తక్కువ సమయంలో శస్త్రచికిత్స చేయడం, రోగులకు వేగంగా కోలుకొనే అవకాశం కల్పించడం దీని ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. చైర్మన్ భద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌ఐ మంత్రా 3.0 వంటి అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ తెలంగాణ వైద్యరంగాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లనుందని చెప్పారు. వైస్ చైర్‌పర్సన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. రోబోటిక్ శస్త్రచికిత్స ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందన్నారు.