calender_icon.png 24 November, 2024 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరుగు పేరుతో దోపిడీ!

24-11-2024 12:21:13 AM

  1. ధాన్యం రైతులను దోచుకుంటున్న మిల్లర్లు
  2. అధిక తూకంతో నిర్వాహకుల చేతివాటం

సూర్యాపేట, నవంబర్ 23 (విజయక్రాంతి): ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చినా రైతులకు దగా తప్పడం లేదు. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని  కొనుగోలు కేంద్రాలకు తెస్తే దోపిడీకి గురవుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అనేక సాకులు చెబుతూ అధిక తూకం వేస్తుండగా, మిల్లుల వద్ద తరుగు పేరుతో ముంచుతున్నారు.

ధాన్యంలో అధిక తేమ పేరుతో మాయిచర్ రావడం లేదని, తాలు ఉన్నదని నిర్వాహకులు ధాన్యం కాంటా వేయడం లేదు. తేమ శాతం 17కు తక్కువ ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కాంటా వేసి మిల్లులకు తరలిస్తున్నారు. అయినా కూడా మిల్లర్లు ధాన్యంలో తేమ ఉందని, ధాన్యం రంగు మారిందని, ధాన్యంలో తాలు ఉన్నదంటూ దిగుమతి చేసుకోవడం లేదు.

దీంతో కేంద్రాల నిర్వాహకులు రంగంలోకి దిగి రైతులతో మాట్లాడి క్వింటాలుకు 3 కేజీల నుంచి 8 కేజీల వరకు కోత విధిస్తున్నారు. కాంటా అయిన తర్వాత ధాన్యం బాధ్యత ప్రభుత్వానిదే. కానీ రైతుల నుంచి తరుగు పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ జరుగతున్నది. ధాన్యాన్ని తూకం వేసిన అనంతరం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రశీదు కూడా ఇవ్వడంలేదని తెలుస్తున్నది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కేజీల బస్తాల్లో ధాన్యం నింపుతారు. సంచి బరువుతో కలిపి 40 కేజీల 600 గ్రాముల తూకం వేయాలి. కానీ తరుగు పేరుతో  కేంద్రాల నిర్వాహకులు ప్రతి బస్తాకు సుమారు కేజీ నుంచి 1.5 కేజీ వరకు అధిక తూకం వేస్తున్నారు.

ఒక లారీలో సుమారు 800 బస్తాలు ధాన్యం రవాణా చేస్తారు. ప్రతి బస్తాలో సరాసరి 1.5 కేజీల అధిక తూకం వేసిన 800 బస్తాలకు గాను 1,200 కిలోలు అంటే 12 క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి దోచుకుంటున్నారు. దీనికి సీవిల్ సప్లయ్ అధికారులు కూడా వంతపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

అన్నారంలో రైతు ఆత్మహత్యాయత్నం

తుంగతుర్తి, నవంబర్ 23: ధాన్యం కొనుగోలులో మిల్లర్ కొర్రీలు పెట్టడంతో ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. చౌళ్లతండాకు చెందిన గుగులోతు ఖిమా నాయక్ కౌలురైతు. తనకు సంబంధించిన 425 బస్తాల ధాన్యాన్ని ఈ నెల 17న అన్నారం ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లాడు.

నిర్వాహకులు ఖిమానాయక్ ధాన్యంతో పాటు మరో రైతుకు చెందిన 260 బస్తాలను కోదాడలోని వెంకటరమణ రైస్‌మిల్‌కు పంపించారు. రైస్‌మిల్ యజమాని ధాన్యాన్ని పరిశీలించి రంగు మారిందని చెప్పి క్వింటాలుకు 3 కిలోలు తరగు తీసివేస్తానని చెప్పాడు. 6 రోజుల పాటు మిల్లులోనే ఉంచుకుని, క్వింటాలుకు 7 కిలోలు తీసివేస్తానని చెప్పాడు.

దీంతో ఖిమానాయక్ తిరిగి శనివారం ఐకేపీ కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చాడు. మనస్థాపానికి గురై పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న రైతులు అడ్డుకున్నారు. తహసీల్దార్ దయానంద్ అక్కడకు చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం మరో మిల్లుకు ధాన్యం తరలించారు.