29-04-2025 12:00:00 AM
అర్దరాత్రి వేళలో గొర్రెలకాపరులపై దాడి
కత్తితో దాడి చేసి, 30 గొర్రెలను చోరీ చేసిన ముఠా
కేసు దర్యాప్తు చేస్తున్న హయత్ నగర్ పోలీసులు
ఎల్బీనగర్, ఏప్రిల్ 28 : గొర్ల మందకు కావలిగా ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి 30 గొర్లను ఎత్తుకెళ్లిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ముఠా దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నవీన్ కు కత్తి పోట్లకు గురై, దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, బాధితుడు నవీన్ తెలిపిన వివ రాలు... రాసూరి నవీన్(29) కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడి తండ్రి రాసూరి శ్రీశైలం గొర్రెలను పెంచుతున్నాడు. అబ్దులాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలోని వేణు గోపాల స్వామి ఆలయం దగ్గర శ్రీశైలం దాదాపు 250 గొర్రెలను మేపుతున్నాడు.
కొన్ని రోజులుగా తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం రాత్రి తండ్రి స్థానంలో అతడి బావమరిది శ్రీకాం త్, నవీన్ గొర్రెల మందకు కాపరిగా వచ్చా రు. కోహెడ గ్రామ సమీపంలోని సంపత్ బాల్రెడ్డి పొలంలో గొర్రెల మంద పెట్టారు. మందకు కావలిగా నవీన్, శ్రీకాంత్ పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 20 నుంచి 25 ఏండ్ల వయస్సున్న 8 లేదా 9 మంది గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెలను చోరీ చేయడానికి వచ్చారు.
ముఠా సభ్యులు ముందుగా కాపలాదారుల వద్ద సెల్ ఫోన్లను దొంగిలించి, నవీన్ పై కత్తులతో దాడి చేశారు. అతడి కుడి కన్ను పైన, తలపై, కుడి భుజం వెనుక భాగంలో కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతడి బావమరిది శ్రీకాంత్ ముఖంపై కొట్టడంతోగాయపడ్డాడు. సమీపంలో పడిన రూ. 5వేల నగదును తీసుకెళ్లారు. వారిపై దాడి చేసి సుమారు 25- 30 గొర్రెలను చోరీ చేసి, బొలెరో వాహనంలో ఎక్కించుకొని పరారయ్యారు.
దాడి చేసిన వ్యక్తులు హిందీ భాషలో మాట్లాడారని నవీన్, శ్రీకాంత్ తెలిపార. దాడి తర్వాత గ్రామస్తుల సహాయంతో పోలీసులకు ఫోన్ చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి, నవీన్, శ్రీకాంత్ ను చికిత్స కోసం ఎల్బీనగర్ లోని కామినేని దవాఖానలో చేర్పించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. హయత్ నగర్ పోలీసులు బృం దంగా ఏర్పడి నేరస్తుల కోసం గాలిస్తున్నారు. గొర్రెలను తరలించిన బోలెరో వాహనం ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలో నేరస్తులను అరెస్టు చేస్తామని సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.