calender_icon.png 19 November, 2024 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ!

19-11-2024 12:07:13 AM

  1. తరుగు పేరుతో రైతుల లూటీ
  2. మంత్రి తుమ్మల ఆదేశాలూ బేఖాతార్
  3. ప్రశ్నించిన రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

కామారెడ్డి, నవంబర్ 18 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల దోపిడీ ఆగడం లేదు. తరుగు పేరుతో రైతులను లూటీ చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి, ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

రైతులకు రూపాయి నష్టం జరుగవద్దని నిర్వాహకులను ఆదేశించారు. అయినా కూడా నిర్వాహకులు మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. విండో కార్యాలయాల అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తేమశాతం పేరుతో 15 నుంచి 20 రోజుల వరకు కాంటా చేయడం లేదు.

ప్రశ్నించిన రైతలు ధాన్యం కోలుగోలును మరింత  ఆలస్యం చేస్తున్నారు. దీంతో పలువురు రైతులు ప్రవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వాహకులు కడ్తా, హమాలీ ఖర్చుల పేరుతో ఇష్టారీతిన దోచేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ఒక్కటి మినహా తూకం విషయంలో నిండా మోసం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. 

నష్టపోతున్న రైతులు

కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల చేతివాటంతో రైతులు నష్టపోతున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల 600 గ్రాముల ధాన్యం తూకం వేయాలని అధికారుల ఆదేశాలన్నాయి. కానీ కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాలో 42 కిలోల 625 గ్రాముల ధాన్యం తూకం వేసి నిర్వాహకులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బస్తాకు 2 కిలోల 250 గ్రాములు అదనంగా తూకం వేస్తున్నారు.

ఈ లెక్కన ఒక్కో క్వింటాలుకు రైతును తరుగు పేరుతో 5 కిలోల నుంచి 5 కిలోలన్నర వరకు దోచేస్తున్నారు. దాదాపు క్వింటాలుకు రైతు రూ.130 నష్టపోతున్నాడు. వంద క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేసిన రైతు నికరంగా రూ.13,000 లకు పైగా నష్టపోతున్నాడు. ఒక్కో బస్తాను తూకం వేసి ఒక్కో బస్తాకు ఒక రూపాయి చెల్లించుకోవాల్సి వస్తోంది.

ఇది కాకుండా క్వింటాకు హమాలీ చార్జీలు రూ.35 రైతులే చెల్లిస్తున్నారు. ఒక్కో రైతుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  ఇంత జరుగుతున్నా అధికారులు తెలియనట్లు వ్యవహరించడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రైతులకు బెదిరింపులు

ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌళిక సదుపాయాలు కూడా కల్పించడంలేదు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఉన్నతాధికారులు సెంటర్లను సందర్శించినప్పుడు అంతా బాగానే ఉన్నదని చెప్పాలని రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు బెదిరిస్తున్నారు. సమస్యలు, లోపాలపై అధికారులకు తెలియజేస్తే ధాన్యం కాంటా పెట్టడంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఫిర్యాదులు ఇస్తే చర్యలు తీసుకుంటాం

కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ గురించి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాజేందర్‌ను ప్రశ్నించగా.. అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. కొందరు రైతులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాము కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తుంటే ఎవరూ కూడా ఫిర్యాదులు చేయడం లేదన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

 రాజేందర్, జిల్లా పౌరసరపరాల శాఖ మేనేజర్, కామారెడ్డి