calender_icon.png 9 November, 2024 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కాంటాల్లో దోపిడీ?

09-11-2024 12:00:00 AM

  1. తూనీకల శాఖ అధికారుల నిర్లక్ష్యం 
  2. మధ్య దళారులకు వరం
  3. తీవ్రంగా నష్టపోతున్న రైతులు

కామారెడ్డి, నవంబర్ ౮ (విజయక్రాంతి): పత్తి రైతులు దళారుల చేతిలో చిత్తవుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కాలం కలిసొచ్చి పత్తిపంట చేతికొచ్చినా సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరగడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.

ఇది దళారీ వ్యాపారులకు వరంగా మారింది. దళారుల వద్ద తూకాల్లో మోసపోతూ నిలువునా నష్టపోతున్నారు. పత్తి విక్రయాలు ప్రారంభానికి ముందే లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తనిఖీలు చేయడం, పత్తి కొనుగోలు చేసే వారిని హెచ్చరించడంలాంటివి చేయకపోవడంతో దళారులు రెచ్చిపోతున్నారు.

పత్తిని తూకం వేసే సమయంలో రైతులను నిండా ముంచుతున్నారు. రైతుల చేతికి పత్తి రాగానే దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. ఊరికో బ్రోకర్‌ను పెట్టుకుని దందా నడుపుతున్నారు. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. తూనికల కొలతల శాఖ అధికారులు తగినంత సిబ్బంది లేరనే సాకుతో తప్పించుకుంటున్నారు.

కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, పిట్లం, లింగంపేట్, రాజంపేట్, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, చిన్నకొడప్‌గల్, నిజాంసాగర్, భిక్కనూర్, దోమకొండ మండలాల్లోని గ్రామాల్లో దళారుల రాజ్యం నడుస్తున్నది. 

ధాన్యం కొనుగోళ్లకు ఐరిస్

 ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. అసలైన రైతులే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిం చేందుకు ఐరిస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వ్యాపారులు కొందరు అక్రమాలకు పాల్పడుతూ రైతుల పేరుతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుండటంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తున్నది.

గతంలో ఆధార్ నంబర్‌తో అనుసంధానమైన సంబంధిత రైతు సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధాన్యం కొనేవారు. ఈ క్రమంలో రైతుల పేరిట వ్యాపారులు, దళారులు ధాన్యం విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఓటీపీతో పాటు ఐరిస్ విధానాన్ని చేపడుతున్నారు. దీంతో అక్రమాలకు అస్కారం ఉండదని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

కౌలు రైతులకు తప్పిన ఇబ్బందులు

ప్రభుత్వం ఐరిస్ విధానం అమలు చేస్తుడటంతో కౌలు రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ధాన్యం కొనుగోలు కంటే ముందే సంబంధిత ఏఈవోలను కలిసి ఎవరి భూములను కౌలుకు తీసుకున్నారో వివరాలు నమోదు చేసుకోవాలని కౌలు రైతులకు అధికారులు సూచించారు.

రైతులు సమర్పించిన వివరాలను ఏఈవోలు, ఓపీఎంఎస్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో కౌలు రైతులు ధాన్యం విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. సిగ్నల్ సమస్య ఉన్న ప్రాంతాల్లో వేలి ముద్రలు సరిగా పడని వారికి ఐరిస్ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. 

క్వింటాలుకు రూ.1,125 నష్టం 

దళారులు క్వింటాలుకు 10 నుంచి 15 కిలోల పత్తి అధికంగా తూకం వేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఈ క్రమంలో క్విం టాలుకు రూ.750 నుంచి రూ. 1,125 వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ లెక్కన వంద క్వింటాళ్ల పత్తిని అమ్మితే రూ.లక్ష వరకు రైతు నష్టపోవాల్సి వస్తోంది. దళారులను నిలువరించే వాళ్లు లేకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. తూనికలు కొలతల అధికారులు తూకంపై దృష్టిపెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఎలక్ట్రానిక్ కాంటాల్లో మాయ

ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులోకి రావడంతో దళారీ వ్యాపారులు రిమోట్ కంట్రోల్‌తో పత్తి అధికంగా తూకం వచ్చేలా చేస్తున్నారు. పత్తి బస్తా 115 కిలోలు ఉన్నా వంద కిలోల బరువు మాత్రమే చూపిస్తుంది. ఈ తతంగం గురించి రైతులతో పాటు చదువుకున్న వారికి కూడా ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో రైతులు మోసపోతున్నారు. 

తప్పుడు తూకాలు వేస్తే చర్యలు

 పత్తి తూకంలో తప్పుడు తూకాలు వేసి రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అధిక తూకంపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. బాట్ల ముద్ర వేసుకోని 10 మంది వ్యాపారులపై జరినామా విధించాం.

శ్రీనివాస్, జిల్లా, లీగల్ మెట్రాలజీ ఇన్సెక్టర్, కామారెడ్డి