calender_icon.png 12 October, 2024 | 12:59 PM

గర్జించిన లంకేయులు

30-09-2024 12:00:00 AM

 కివీస్ వైట్ వాష్ 

గాలె: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 602 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 88 పరుగులకే చాపచుట్టేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 360 పరుగులు మాత్రమే చేసి ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

అజేయ సెంచరీతో భారీ స్కోరుకు బాటలు వేసిన కమిందు మెండిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, రెండు టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన జయసూర్యకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. ఈ విజయంతో శ్రీలంక డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 

ఇద్దరూ ఆరేశారు.. 

మొదటి ఇన్నింగ్స్‌లో ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో న్యూజిలాండ్ నడ్డి విరవగా.. రెండో ఇన్నింగ్స్‌లో పీరిస్ ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పీరిస్ 3 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య మూడు వికెట్లతో చెలరేగాడు.

కనిపిస్తున్న జయసూర్య మార్క్..

వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్య శ్రీలంక జట్టుకు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంక ఆటతీరే పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ ఓటములతో సతమతమయ్యే లంక జయసూర్య మార్గనిర్దేశనంలో రెచ్చిపోతుంది. 27 ఏళ్ల తర్వాత ఇండియా మీద వన్డే సిరీస్ నెగ్గడమే కాకుండా ఇంగ్లండ్ మీద 10 ఏళ్ల తర్వాత ఓ టెస్టును కూడా గెలిచింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌ను వైట్ వాష్ చేసింది. ఇది చూసి జయసూర్య తన మార్క్ చూపిస్తున్నాడని అంతా అంటున్నారు.