calender_icon.png 21 November, 2024 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డెక్కిన ధాన్యం రైతులు

11-11-2024 02:05:59 AM

మిర్యాలగూడ మండలం అవంతీపురం శివారులో కోదాడ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

  1. మద్దతు ధర చెల్లించాలని రహదారులపై ధర్నా 
  2. నల్లగొండ జిల్లాలో ఆందోళనలు

నల్లగొండ, నవంబర్ 10 (విజయక్రాంతి): మిల్లర్లు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర గ్రామాల రైతులు ఆదివారం రోడ్డెక్కారు. మిర్యాలగూడ మండలం అవంతీపురం వద్ద కోదాడ మిర్యాలగూడ, వేములపల్లి మం డలం శెట్టిపాలెం శివారులో నార్కెట్‌పల్లి రహదారిని నిర్బంధించి ధర్నా చేశారు. మిల్లర్లు తేమ, తాలు పేర కొర్రీలు పెట్టి ధర తగ్గించి తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుమస్తా రుసుము, హమాలీ ఇతర ఖర్చులు తమపై రుద్దుతూ అదనపు దోపిడీ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

ఇదేమిటని ప్రశ్నిస్తే మిల్లులకు తాళం వేసి కొనుగోళ్లు నిలిపివేశామని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా క్విం టా ధాన్యానికి (సన్నాలకు) రూ.2,200లోపే చెల్లిస్తున్నారని వాపోయారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించి వెంటనే కొనుగోళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నా కారణంగా ఆయా రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు చేరుకొని రైతులకు సర్ది చెప్పారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రైస్ మిల్లులను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మిల్లర్లు నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే తనకు నేరుగా ఫోన్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే కలుగజేసుకోవడంతో మధ్యాహ్నం తరువాత మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో మధ్యాహ్నం మిల్లుల ఎదుట ధాన్యం ట్రాక్టర్లు బారులుదీరాయి.