calender_icon.png 21 April, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ పనులతో రోడ్లు అధ్వానం

19-04-2025 09:16:53 PM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్...

షాద్‌నగర్ (విజయక్రాంతి): గతంలో నిర్వహించిన మిషన్ భగీరథ పనుల కారణంగా పట్టణంలోని అనేక రహదారులు, సీసీ రోడ్లు ధ్వంసం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని 8వ వార్డులో శివ హౌస్ నుండి అనంతయ్య ఇంటి వరకు రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు పనులతో పాటు, అనిల్ ఇంటి నుండి దయానందం ఇంటి వరకు రూ. 5 లక్షల జనరల్ ఫండ్స్‌తో సీసీ రోడ్డు పనులు, అలాగే 7వ వార్డులో ఓల్డ్ హైవేలోని భారత్ పెట్రోల్ పంపు నుండి భాష్యం స్కూల్ వరకు రూ. 6 లక్షల జనరల్ ఫండ్స్‌తో చేపట్టే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సీసీ రోడ్లను తిరిగి నిర్మించి, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. గతంలో మిషన్ భగీరథ పనుల వల్ల దెబ్బతిన్న రోడ్లను తిరిగి నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

మున్సిపాలిటీ ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, మంచి నీరు వంటి సౌకర్యాలను పూర్తి స్థాయిలో అందించడానికి కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ కౌన్సిలర్ శాంతమ్మ, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, ఇతర స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.