- ‘బ్లాక్‌స్పాట్ల’ను పట్టించుకోని యంత్రాంగం
- రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా నిర్లక్ష్యమే
నిజామాబాద్, నవంబర్ 2౮ (విజయక్రాంతి): ‘రహదారులు.. ప్రగతికి సోపా నాలు’ అనే నానుడి పోయి నిజామాబాద్ జిల్లాలో ‘రహదారులు.. ప్రాణసంకటాలు’ అనే నినాదం పుట్టుకొచ్చేట్టు ఉంది. జిల్లాలోని జాతీయ, రాష్ట్రీయ రహదారులు దెబ్బ తినడంతో వరుసగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఎన్‌హైవే అథారిటీ, ఆర్‌అండ్‌బీ శాఖలు ‘బ్లాక్‌స్పాట్ల’ గురించి పట్టిం చుకోకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరగుతూ వస్తున్నది. ఇటీవల కురిసిన వర్షా లకు లక్కొర, మోర్తాడ్ మధ్య బ్రిడ్జి కొట్టుకుపోయింది. 60 ఫీట్ల రహదారి ఒకవైపు ఒరుసుకుపోయింది.దీంతో యంత్రాంగం అంచున గోడ నిర్మించి వాహన రాకపోకలు సాగేలా చర్యలు తీసుకున్నారు.
ఫలితంగా ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. ఎన్‌హెచ్ 63 పరిధిలోని లొక్కర ప్రాంతంలో వాహనాలు అకస్మాత్తుగా బాటిల్ నెక్ రోడ్‌లోకి వెళ్తుండడంతో అదుపుతప్పి రోడ్డుప్రమాదాలు సంభవిస్తు న్నాయి. లొక్కర సమీపంలోని బ్రిడ్జి ప్రాం తంలో రోడ్డు ఛిద్రం కావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
గత నెలలో సంభవించిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. చంద్రాయణ్‌పల్లి హైవేపై గతేడాదిలో పదికిపైగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. బోధన్, నిజామాబాద్ వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారి పలుచోట్ల గుంతలమయంగా ఉంది. ఈరోడ్డుపై ఇప్పటివరకు 2,300 పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు లెక్కలు నమోదయ్యాయి.
కొత్త రోడ్ల నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్), ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. భూ సేకరణ సమస్యలు లేని ప్రాంతంలో రోడ్లు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు.