రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాలి
మహబూబాబాద్, మే 24 (విజయక్రాంతి): మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుండి పిఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్ వరకు అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు కుమ్మరికుంట్ల నాగన్న మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ నుండి రోడ్డు శాంక్షన్ అయినదని చెప్పి రోడ్డుకు ఇరువైపులా తవ్వి కంకరపోసివదిలేశారని ఆరోపించారు. కొంత మేర పని పూర్తి చేసి , కొంత మేర డివైడర్ నిర్మించి, మరికొంత మేర కంకర పరిచి వదిలేశారని, దీనితో ఈ మార్గంలో ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.
కంకర రాళ్లు తేలి ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ తక్షణమే స్పందించి మిగిలిన రోడ్డుపై డాంబర్ వేయాలని, అదేవిధంగా డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మామిళ్ళ నరసింహారావు, బోడా శంకర్, చిట్టిమల్ల ఉపేందర్, శ్రీరాములు, ఇమామ్, చందు, ఉపేందర్, పార్నంది ఎంకన్న, రాజు, గణేష్, మల్లేష్ పాల్గొన్నారు.






