calender_icon.png 10 January, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి రోడ్డు భద్రతా మాసోత్సవాలు

01-01-2025 12:41:49 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం బుధవారం నుంచి ఈ నెల 31 వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా వర్క్ షాప్‌లు, సెమినార్లు, డ్రైవర్లు, స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, కంటి చెకప్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు భద్రతా మాసంలో పోలీస్, విద్యాశాఖ ఇతర విభాగాలు భాగస్వామ్యం కావాలని కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవంపై మంగళవారం అధికారులతో మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రవాణా శాఖ అధికారులంతా కొత్తగా తయారు చేసిన లోగో ఉన్న యూనిఫాం ధరించాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నిబంధనలపై రవాణా శాఖ అధికారులు ప్రతి నెలలో నాలుగు పాఠశాలలు సందర్శించి అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ర్టంలోని 97 ఆర్టీసీ డిపోలు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు తెలిపారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్‌తోపాటు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టాలని డీజీపీ జితేందర్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కూడా గ్రామీణస్థాయి నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడానికి ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసే ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లను జనవరిలోపు కనీసం 50 పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆర్టీసీలో కొత్త బస్సుల యాక్షన్ ప్లాన్‌పై మంత్రి ఆరా తీశారు. ఆర్టీసీలో కొత్తగా నియామకం కానున్న ఉద్యోగాలు, ఇప్పటికే పెద్దపల్లి, ఏటూరునాగారానికి మంజూరు చేసి బస్సు డిపోల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు.

మధిర, కోదాడ, హుజూర్‌నగర్, మంథని, ములుగు బస్ స్టేషన్ల  అభివృద్ధి తదితర అంశాలపై మంత్రి పొన్నం పలు సూచనలు చేశారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, జేటీసీలు, డీటీసీలు, ఆర్టీవోలు, ఆర్టీసీ ఈడీలు, ఆర్‌ఎంలు పాల్గొన్నారు.