- గుంతలతో వాహనదారుల అవస్థలు
- పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
జహీరాబాద్, జూలై 29: రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతో పనులు జరగడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్‌కల్ మండలంలోని ప్రధాన రోడ్డుపై గుంతలు పడడంతో వాహనదారుల అవస్థలు అన్నీఇన్ని కావు. గత ప్రభుత్వం మండలంలోని జహీరాబాద్ రోడ్డు మరమ్మతులకు రూ.3.20 కోట్లు, రాయికోడ్ మండలంలోని శంశోల్లాపూర్ నుంచి మెటల్‌కుంట రోడ్డు మరమ్మతులకు రూ.5.60 కోట్లు, చాల్కి రోడ్డుకు రూ.1.52 కోట్లు మంజూరు చేసింది.
టెండర్లు సైతం పూర్తయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టడం లేదు. వర్షాకాలం కావడంతో రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు పనులు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో గుంతలు పడిన రోడ్లపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. కాగా రోడ్ల మరమ్మతు విషయమై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పనులు చేపడుతామని పేర్కొన్నారు.