calender_icon.png 23 December, 2024 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డెక్కిన కానిస్టేబుళ్ళు

27-10-2024 12:00:00 AM

ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ తెలంగాణలో పోలీసు బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. నిన్నమొన్నటిదాకా కుటుంబ సభ్యులు మాత్రమే రోడ్డెక్కగా తాజాగా శనివారం ప్రత్యక్షంగా పోలీసులే ఆందోళనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెటాలియన్ కమాండెంట్ల కార్యాలయాల ముందు కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగడం విశేషం.

‘ఏక్ పోలీస్, ఏక్ స్టేట్’ విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వివిధ జిల్లాల్లోని పోలీసు బెటాలియన్ల వద్ద  కానిస్టేబుళ్ల భార్యలు పిల్లలతో కలిసి రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు. అంతేకాదు హైదరాబాద్‌లో సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిం చారు.

ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికీ ఒకేలా ఉద్యోగం ఉండాలి కానీ తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండేలా విధులు చేయాల్సి వస్తోందని ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్ళ భార్యలు ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో మూడు పోలీసు స్టేషన్లలో పని చేయాల్సి వస్తోందని, ఫలితంగా తమ భర్తలు కుటుంబాలకు దూరమవుతున్నారనేది వారి ప్రధాన ఆందోళన.

తమిళనాడు, కర్నాటకలోలాగా తెలంగాణలోనూ ‘ఏక్ పోలీస్’ విధానాన్ని అమలు చేయాలన్నది వారి డిమాండ్. మిగతా రెగ్యులర్ పోలీసుల్లాగా తమ భర్తలు కూడా మూడునుంచి అయిదేళ్ల పాటు ఒకే చోట పనిచేసేలా చూడాలని కూడా వారు కోరుతున్నారు.

కుటుంబ సభ్యుల ఆం దోళనతో రాష్ట్రప్రభుత్వం బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. అలాగే బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చించాలని కూడా నిర్ణయించింది. అయితే శనివారం కానిస్టేబుళ్లే ప్రత్యక్షంగా ఆందోళనకు దిగడంతో పరిస్థితి జటిలంగా మారింది.

నిజానికి దేశంలోనే పోలీసు సంస్కరణలు చేపట్టిన తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలుస్తుంది.1969 నవంబర్‌లోనే కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే ప్రభుత్వం తొలి పోలీసు కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆర్‌ఏ గోపాలస్వామి నేతృత్వంలో ఏర్పాటయిన ఆ కమిషన్ రాష్ట్రం లో మూడు కేడర్ వ్యవస్థలు అంటే రాష్ట్ర పోలీసు సర్వీస్, పోలీసు ఎగ్జిక్యూటివ్ సర్వీస్, పోలీసు కానిస్టేబులరీ సర్వీస్ మాత్రమే ఉండాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అంతేకాకుండా పోలీసుల వేతనాలు, ఇతర సమస్యలతో పాటుగా  పోలీసు స్టేషన్లలో సదుపాయాలకు సంబంధించి కూడా పలు సిఫార్సులు చేసింది.

రాష్ట్రంలో ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. అంటే రాష్ట్రంలోని కానిస్టేబుళ్లందరికీ ఒకే సర్వీసు నిబంధనలు వర్తిస్తాయి. కర్నాటకలో కూడా దాదాపుగా ఇదే విధానం కొనసాగుతోంది. తెలంగాణలో కూడా గతంలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు 15 రోజుల పాటు డ్యూటీ ఉంటే కొద్ది రోజుల పాటు కుటుంబాలతో గడిపే వీలు ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానంలో మార్పులు చేశారు.

దీంతో బెటాలియన్లలో పని చేసే కానిస్టేబుళ్లలో కొంత మంది జిల్లా ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తే మిగతా వాళ్లు జిల్లాలోని మిగతా పోలీసు స్టేషన్లలో ప్రతి నాలుగు నెలలకో చోట రొటేషన్ పద్ధతిలో పని చేయాల్సి వస్తోంది. అదే ఇప్పడు వారి ఆందోళనకు కారణమయింది. మిగతా పోలీసుల్లాగా తమ భర్తలు కూడా మూడు నాలుగేళ్లు ఒకే చోట పని చేసేందుకు వీలు కల్పించాలని, ఉద్యోగంతో పాటు కుటుంబాలు కూడా ముఖ్యమని కానిస్టేబుళ్ల భార్యలు వాదిస్తున్నారు.

అంతేకాకుండా తమ భర్తల చేత పగలు, రాత్రి తేడా లేకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారనీ ఆరోపిస్తున్నారు. అయితే కానిస్టేబుళ్ళు ఆందోళన చేయడాన్ని రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. క్రమశిక్షణతో కూడిన దళంలో ఉంటూ ఆందోళన చేయడం సరికాదని, ఆందోళన విరమించని పక్షంలో వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మరి ఈ సమస్య ఎలా ముగుస్తుందో చూడాలి.