07-03-2025 12:00:00 AM
డీపీఆర్‌లు తప్పుల తడకగా ఉంటున్నాయి
ఇంజీనీర్లకు జవాబుదారీతనం లేదు
2023లో 1.8 లక్షల మందిని బలిగొన్న రోడ్లు
న్యూఢిల్లీ, మార్చి 6: నాసిరకం రోడ్డు డిజైన్లపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో జరిగిన “గ్లోబల్ రోడ్ ఇన్ఫ్రాటెక్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో (జీఆర్‌ఐఎస్)లో ఆయన మాట్లాడుతూ.. నాసిరకం రోడ్లు, ఇంజినీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు పెరిగేందుకు నాసిరకం రోడ్డు డిజైన్లు, తప్పుడు తడకగా ఉన్న డీపీఆర్ రిపోర్ట్‌లే కారణం. సివిల్ ఇంజినీర్లు కూడా ఇందుకు కారణమే. అవే తప్పులు రోడ్డు నిర్మాణంలో కూడా కొనసాగడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరికీ జవాబుదారీతనం లేదు. రోడ్డు మార్కింగ్ లాంటి చిన్న విషయాలు కూడా సరిగ్గా జరడం లేదు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల నుంచి నేర్చుకోవాలి.
రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు ఇంజనీర్లే కారణం అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తుంటుంది. అతి పెద్ద సమస్య రోడ్ ఇంజనీరింగ్, సరిగ్గా లేని ప్లానింగ్, సరైన విధంగా లేని డీపీఆర్’. అని అన్నారు. ఇక ఇదే సమావేశంలో అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కపిల మాట్లాడుతూ.. ‘రోడ్ డిజైన్ నిర్మాణంలో భద్రతకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. మన లక్ష్యం భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాల వల్ల ఒక్కరి ప్రాణం కూడా పోకుండా ఉండటం’ అని అన్నారు. ఇటీవలే అన్ని రాష్ట్రాల మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భారత్‌లో 2023వ సంవత్సరంలో 1,80,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు పేర్కొన్నారు. 2022లో 4.6 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,70,000 మంది మరణించారు. 2030 వరకు రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్యను సగానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.