27-03-2025 11:57:33 AM
ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీని వెనక నుండి ఢీకొట్టిన మరో లారీ
క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీసిన పోలీసులు
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal)లోని సోమ గూడెం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు భారీ ఇనుప రాడు లోడుతో వెళ్తున్న లారీల మధ్య వేగ నియంత్రణలో ఏర్పడిన లోపం ప్రమాదానికి కారణమైంది. ముందు వెళ్తున్న లారీని వెనకాల వస్తున్న లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో వెనక లారీలో ఉన్న డ్రైవర్ గురు వీర్ సింగ్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్(Kasipet SI Praveen Kumar) తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ఫైర్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కొంత సమయం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. గ్యాస్ కట్టర్ తో క్యాబిన్ లోని కొంత భాగాన్ని తొలగించి ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా డ్రైవర్ గురు వీర్ సింగ్ ను బయటకు తీసి హుటాహుటిన ఆంబులెన్స్ లోఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరపనున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.