భువనేశ్వర్: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున స్థానిక గ్రామస్థులతో వెళ్తున్న మినీబస్సు హేమగిరి పోలీసు పరిధిలోని గైకనపాలి ప్రాంతంలో నిశ్చలంగా ఉన్న ట్రైలర్‌ను ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీపావళిని పురస్కరించుకుని భక్తిగీతాలు పాడే కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న బాధితులు ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం సంభవించింది.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, దట్టమైన పొగమంచు ఆ ప్రాంతాన్ని కప్పివేసిన కారణంగా ప్రమాదాన్ని నివారించడానికి మినీబస్ డ్రైవర్ సకాలంలో పార్క్ చేసిన ట్రైలర్‌ను చూడలేకపోయాడు. ప్రమాద శబ్ధంతో చుట్టుపక్కల గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. నివాసితుల సహాయంతో గాయపడిన ప్రయాణికులను అత్యవసర వైద్య సంరక్షణ కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదు. అయితే అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం తరలించారు. ఇదిలా ఉండగా, ట్రైలర్‌ను రోడ్డు మధ్యలో ఉంచారని స్థానికులు ఆరోపించడంతో ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆగ్రహించిన స్థానికులు మృతుల బంధువులకు అవసరమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.