బైక్‌ను ఢీకొని చెట్టును ఢీకొట్టిన కారు
ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు
నల్లగొండ జిల్లా తిప్పర్తి శివారులో ఘటన
నల్లగొండ,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా తిప్పర్తి శివారులో అద్దంకి రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి వెనుక నుంచి బైక్ ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తితోపాటు కారులో ప్రయాణిస్తున్న మహిళ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మిర్యాలగూడెం మండలం దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్ (33) నల్లగొండ నుంచి బైక్‌పై మిర్యాలగూడ వైపు వెళ్తున్నాడు. అదే మార్గంలో వెళ్తున్న కారు అతివేగంగా బైక్‌ను ఢీకొట్టి రోడ్డు దిగువకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కారు ఢీకొన్న వేగానికి బైక్ పైనుంచి శ్రీనివాస్ ఎగిరిపడి తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలో కోల్పోయాడు. చెట్టును ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.