30 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర గాయాలు
జిల్లా ఆసుపత్రికి తరలింపు
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేటు స్కూల్ బస్సు ట్రాక్టర్ ఢీకొని 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిజినపల్లి మండలంలోని మేధాంన్స్ ప్రైవేటు పాఠశాల కు చెందిన స్కూల్ బస్సు గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకొని బిజినపల్లి వెళుతుండగా అటుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కనే బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30మందికి పైగా విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే 108 సాయంతో నాగర్కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త, బస్సు ఫిట్నెస్ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.