ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం
మనుమడి పరిస్థితి విషమం
క్షతగాత్రుల ఆసుపత్రికి తరలింపు
జగిత్యాల,(విజయ క్రాంతి): జిల్లాలోని పొలాస వద్ద జాతీయ రహదారి 63పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి తాతా, మనవరాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మనుమడి పరిస్థితి విషమంగా ఉండగా ఈ ప్రమాదంలోనే మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా పొలాస వద్ద జాతీయ రహదారి 63పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక నుండి వస్తున్న యాక్టివా మోటార్ సైకిల్ పై లచ్చయ్య మూలమలుపు వద్దకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు అతి వేగంగా టీఎస్ 12 యూడి 9955 ప్రైవేటు ట్రావెల్స్ బస్సు స్కూటీని ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది.
ధర్మపురి నుండి రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనం స్టూటీపై బండ్ల లచ్చయ్య (60) మనుమరాలు శ్రీనిధి (10), మనుమడు మల్లికార్జున్ (13)ప్రయాణిస్తున్న క్రమంలో బస్సు టైర్ల కింద పడ్డారు. ఇందులో తాత బండ్ల లచ్చయ్య (60), మనుమరాలు శ్రీనిధి (10) అక్కడికక్కడే మృతి చెందగా మనుమడు మల్లికార్జున్ తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో అదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మరో మోటార్ సైకిల్ ని ఢీ కొట్టిన ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ముగ్గురిని జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి 108 లో తరలించారు. జగిత్యాల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.