మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు మండలం రామానుజవరం గ్రామ పంచాయతీ కొండాయిగూడెం హెల్త్ సబ్ సెంటర్ వద్ద సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గంటకు 225 లీటర్ల సామర్థ్యమున్న ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శనివారం సింగరేణి అధికారులు ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్ ఓ ప్లాంటుతో గ్రామ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను సింగరేణి యాజమాన్యం విజయవంతంగా పూర్తి చేసి, రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛమైన తాగునీరు ఈ ప్లాంట్ ద్వారా అందుబాటులోకి రానందని, గ్రామస్తులు కలుషిత నీటి సమస్య పరిష్కారం అవ్వడమే గాక ఆరోగ్యానికి మేలుగా ఉంటుందన్నారు. సింగరేణి యాజమాన్యం కేవలం బొగ్గు తవ్వకాలలోనే కాక, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ, ఈ ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచేందుకు అంకితభావంతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ నుండి శ్రీనివాస్ రావు, మాజీ సర్పంచ్, గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు బాడీస సతీష్ గ్రామస్తులు సాదిని, సీతయ్య, కట్ట, నరసయ్య, లతిప్, పాషా, పంచాయతీ గుమస్తా రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.