calender_icon.png 25 November, 2024 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డగోలుగా ఆర్‌ఎంసీ ప్లాంట్లు

25-11-2024 01:02:23 AM

  1. తీవ్రకాలుష్యంతో శంషాబాద్ మున్సిపాలిటీలో జనం ఇక్కట్లు
  2. నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్న పీసీబీ అధికారులు
  3. నేతలు, ఆయా శాఖల అధికారులకు భారీగా ముడుపులు!

రాజేంద్రనగర్, నవంబర్24: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్‌ఎంసీ ప్లాంట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. ఇవి వెదజల్లే కాలుష్యంతో జనాలు ఇక్కట్లు పడుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు అమ్యామ్యాలు తీసుకుంటూ సైలెంట్‌గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి లో సుమారు 20 ఆర్‌ఎంసీ (రెడీమిక్స్ కాంక్రీట్) ప్లాంట్లు ఉన్నాయి. వీటికి ప్రతీరోజు వందల సంఖ్యలో భారీ లోడింగ్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో శంషాబాద్ పట్టణం నుంచి ఆయా ప్లాంట్ల వరకు వెళ్లే దారుల్లో మోకాళ్ల లోతు గోతులు పడ్డాయి. దీంతోపాటు ఔటర్‌రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు కూడా ఛిద్రమవుతోంది. 

చేతులు ముడుచుకున్న మున్సిపాలిటీ

నిబంధనలకు విరుద్ధంగా 111 జీవో పరిధిలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన శంషాబాద్ మున్సిపల్ అధికారులు ఏమా త్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులతో పాటు నేతలకు ప్రతీనెల ఠంచన్‌గా అమ్యామ్యాలు అందడంతో చర్యలు తీసుకోవడం లేదని శంషాబాద్ పట్టణవాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నోటీసులతో సరి!

ఆర్‌ఎంసీ ప్లాంట్లపై కొన్నిరోజుల క్రితం పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పీసీబీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులిపుకున్నారు. అనుమతులు లేకుండా.. అడ్డగోలుగా కాలుష్యం, దుమ్ము, ధూళి వెదజల్లుతున్న ప్లాంట్లపై చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఆర్‌ఎంసీ ప్లాంట్లను తక్షణమే మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

చర్యలు తీసుకుంటాం

శంషాబాద్ మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆర్‌ఎంసీ ప్లాంట్ల విషయం మా దృష్టికి వచ్చింది. త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

 రవీందర్ దత్,

శంషాబాద్ తహసీల్దార్

టాస్క్‌ఫోర్స్ రిపోర్ట్ తర్వాత చర్యలు

శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఆర్‌ఎంసీ ప్లాంట్లన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. గతంలో నోటీ సులు జారీచేశాం. టాస్క్‌ఫోర్స్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఆర్‌ఎంసీ ప్లాంట్లను మూసేస్తాం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. 

 వెంకటనర్సు, పీసీబీ ఈఈ