calender_icon.png 22 December, 2024 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైళ్లలో రాచమర్యాదలు

27-08-2024 12:00:00 AM

హత్య కేసులో  విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాజమర్యాదలు లభిస్తున్నట్లు ట్ల ఆరోపణలు రావడం, దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతోఈ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్న అగ్రహార కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే దర్శన్‌కున్న పలుకుబడి, పాపులారిటీ దృష్ట్యా,జైల్లోను అతనికి రాచమర్యాదలు లభిస్తున్నాయన్న ఆరోపణలు మొదటినుంచీ ఉన్నాయి. తాజాగా జైలు బ్యారక్‌నుంచి బైటికి వచ్చి మిత్రులతో కూర్చుని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది.

జైల్లోనే ఉన్న రౌడీషీటర్ ఒకరుఆ ఫొటోను రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్న తన భార్యకు పంపినట్లు తెలిసింది. దీనిపై కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేడంతో పాటు ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.అలాగే దర్శన్‌ను వేరే జైలుకు మార్చాలని కూడా ఆదేశించింది. అయితే జైల్లో నేరస్థులుగా ఉంటున్న వారు రాజమర్యాదలు అనుభవించిన ఘటన ఇది కొత్తదేమీ కాదు. గతంలో ఇదే జైల్లో అప్పటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఇష్టసఖి శశికళ అనుభవించిన రాచమర్యాదలకు సంబంధించిన కథనాలు అప్పట్లో సంచలనం కలిగించాయి.

అక్రమ ఆస్తులకు సంబంధించి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నాయంటూ అప్పటి జైళ్ల శాఖ డీఐజీ రూపా 2017లో ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి  వినయ్ కుమార్ ఆమె చేసిన ఆరోపణలన్నీ నిజమేనని ధ్రువీకరిస్తూ ఓ నివేదిక సమర్పించారు. జైల్లో శశికళ ఖైదీ దుస్తులు కాకుండా తనకిష్టమైన దుస్తులు ధరించడానికి అనుమతించారని, ఆమె ఉంటున్న జైలుగదిలో ఆమెకోసం ప్రత్యేకంగా  ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేశారని ఆ నివేదిక పేర్కొంది.

అంతేకాకుండా ఆమె కోసం ప్రత్యేకంగా విజిటర్స్ రూమ్, కారిడార్ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందుకోసం రూ.2 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా శశికళ ప్రత్యేక సౌకర్యాలు పొందడానికి జైలు రిజిస్టర్‌లో రికార్డులను కూడా తారుమారు చేసినట్లు తెలిసిందని ఆ నివేదిక పేర్కొంది. ఇక డిపాజిటర్లకు, బ్యాంకులకు రూ.20 వేల కోట్లు చెల్లించనందుకు ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న సహారా ఇండియా పరివార్ అధినేత సుబ్రతా రాయ్ జైల్ల్లో ఏసీ గది, వెస్ట్రన్ స్టుల్ టాయిలెట్, మొబైల్ ఫోన్, వైఫై, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు పొందేందుకు రూ.31 లక్షలు చెల్లించినట్లు అరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ మొత్తం ఏడాదికి  రూ.1.23 కోట్లుగా తేలింది.

అంటే రోజుకు రూ.54 వేలకు పైగా ఆయన కంపెనీ చెల్లించింది.బహుశా తీహార్ జైల్లో ఎయిర్ కండిషన్ సదుపాయం పొందిన తొలి వ్యక్తి సుబ్రతారాయ్ అని జైళ్లలో ప్రముఖుల జీవితాలకు సంబంధించి పుస్తకం రాసిన ప్రముఖ జర్నలిస్టు సునేత్రా చౌదరి వ్యాఖ్యానించారు. కోర్టు అనుమతించిన కారణంగా ఆయనకు ఈ సదుపాయాలన్నీ కల్పించాల్సి వచ్చిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. వీరే కాదు, సమాజ్‌వాది పార్టీ నేత అమర్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్ సింగ్, ఆశారాం బాపు లాంటి వివిధ నేరాల కింద శిక్షలు అనుభవించిన పలువురు నేతలకు కూడా జైల్లో రాచమర్యాదలు లభించాయి.

వీరిలో కొందరు ఆరోగ్య కారణాలు సాకుగా చూపి ప్రత్యేక సదుపాయాలు పొందితే మరి కొందరు లంచాలు మరిగిన జైలు అధికారుల ప్రాపకంలో ఈ సౌకర్యాలన్నీ అనుభవించారని స్పష్టమవుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడంత పొడవు ఉంటుంది.  వీరంతా సమాజంలో వివిధ రంగాల్లో పలుకుబడి కలిగిన వారు, వ్యవస్థలను సైతం మేనేజ్ చేయగల వారు కావడం గమనార్హం ఈ తీరు మారడం ఎప్పటికి సాధ్యమవుతుందో!