calender_icon.png 10 March, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహాల గుర్తింపు..!

09-03-2025 01:45:51 PM

కీలక దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్

జిపిఆర్ రాడార్, కేరళ జాగిలాల సహాయంగా మృతదేహాల వద్ద భారీగా తవ్వకాలు

ఆ మృతదేహం ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తింపు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో రిస్కీ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. 16వ రోజు రెండు ప్రదేశాల్లో సుమారు 6 మీటర్ల లోతు తవ్వకాలు జరుపగా ఒక ప్రదేశంలో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ సంబంధించిన మృతదేహంగా అధికారులు రెస్క్యూటిమ్ బృందాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం రెస్క్యూటిమ్ సుమారు 160 మందికి పైగా బృందాలతో పాటు కేరళ నుంచి వచ్చిన రెండు జాగిలాలు మరోసారి సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

13.6 కిలోమీటర్ దాటి నీటి ఉధృతి బురదను తట్టుకొని సహాయక బృందాలు మరికొంత దూరం ముందుకు వెళ్లేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నీటిలోనూ ప్రయాణించేందుకుగాను కలప దుంగలను పడవగా మార్చి వాటి ఆధారంగా రెస్క్యూటిమ్ బృందాలు డేంజర్ జోన్ వరకు వెళ్లాయి. ఎన్జిఆర్ఐ నిపుణులు జిపిఆర్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లోనూ కేరళ నుంచి వచ్చిన రెండు జాగిలాలు అదే ప్రదేశంలో మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించడంతో రాట్ హోల్ మైనర్స్, ఆర్మీ నేవీ వంటి రెస్క్యూ టీం బృందాలు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాయి. ఆదివారం ఒక ప్రదేశంలో కార్మికుడి చేతి, కాలు బయటపడగా ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం అయి ఉంటుందని ప్రాథమిక అంచనాకొచ్చినట్లు తెలిసింది.

దాంతోపాటు మరి కొన్ని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపేందుకు అడ్డుగా ఉన్న టిపిఎం యంత్రాన్ని గ్యాస్ ప్లాస్మా కట్టర్ ద్వారా వేరు చేస్తున్నారు. ఈ సాయంత్రానికి మరికొన్ని మృతదేహాల ఆనవాళ్లు లేదా ప్రదేశాలను పూర్తిస్థాయిలో గుర్తించే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ టీం బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో రక్షణ చర్యలు వేగవంతం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆదేశాల మేరకు రోజు రోజూకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్  బాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ లు వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ జయప్రకాష్ ప్రతినిధి ప్రవీణ్ సింగ్ లు ఎస్బిసి టన్నెల్ వద్ద పరిస్థితులపై మరోసారి సమీక్షించారు.