వర్షాకాలం వచ్చేసిందంటే చాలు.. వానలు తమతో పాటు రోగాలను కూడా తీసుకువస్తుంటాయి. వానలు పడుతున్నాయని ఆనందపడే లోపు జలుబు, జ్వరాలు లాంటి సీజనల్ వ్యాధులతో వందలాది మంది ఆస్పత్రుల పాలవుతుంటారు. ఈ ఏడాది తెలంగాణలో వర్షాలు విస్తారంగా పడడంతో సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి.రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జలుబు, జ్వరాలు లాంటి సాధారణ జబ్బులతో పాటుగా డెంగీ, మలేరియా లాంటి అంటువ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. గడచిన నెరోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది జ్వరాల బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల అంచనాలు చెబుతున్నాయి.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా పిల్లలు డెంగీ వ్యాధి కారణంగా ప్రా ణాలు కోల్పయినట్లు చెప్తున్నారు. అధికారిక లెక్కలకంటే పది రెట్లు ఎక్కువే ఈ వ్యాధుల బారిన పడి ఉంటారని అనధికారిక సమాచారం. ఒక్క భాగ్యనగరంలోనే వేల సంఖ్యలో రోగులతో ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడు తున్నాయి. నగరంలోని ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీలాంటి పెద్ద ఆస్పత్రులతో పాటుగా బస్తీ దవాఖానాలు కూడా డెంగీ, మలేరియా లాం టి రోగాలతో బాధపడుతున్న వారితో నిండిపోతున్నాయి. ఇక జిల్లాల్లో, ఏజన్సీ ప్రాంతాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటోంది. ఔట్‌పేషెంట్ విభాగానికి వచ్చే వారిలో సగం మందికి పైగా సీజనల్ వ్యాధులకు చెందిన వారే ఉంటున్నారు.
ప్రభుత్వ అంచనాలకు మించి రాష్ట్రంలో జ్వరా లు, డెంగీ, మలేరియా కేసులున్నట్లు వైద్యులు చెబుతున్నారు.ఇక ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో చికిత్స తీసుకున్న వారు కూడా కలిస్తే ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఉంటుంది. ఈ పరిస్థితి ఈ ఒక్క సంవత్సరంలోనే కాదు. ప్రతి ఏడాదీ ఇదే తంతు. వేసవి రోజుల్లో డ్రైనేజిలు, కాలువలు వంటి వాటిలో నీరు నిలిచిపోయి దోమలకు నిలయంగా మారుతుంటాయి.వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో మున్సిపాలిటీలు, గ్రామాల్లోని పారిశుద్ధ్య సిబ్బంది నాలాలు, డ్రైనేజిలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణ కోసం ఫాగింగ్‌లాంటివి చేయాలి. కానీ కొంతకాలంగా వీటిగురించి పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.
అంతేకాదు వర్షాలకారణంగా రోడ్లు, ఇళ్ల వద్ద నీరు నిలిచి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో ఈ ఏడాది ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా రోగాల ప్రభావం పేద వర్గాలపై ఎక్కువగా పడుతోంది. ఇంటిలో పని చేయగల శక్తి ఉండే ఒకరిద్దరు జ్వరాలు లాంటి వ్యాధులతో మంచాన పడడడంతో పూట గడవడం కూడా కష్టమవుతోంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లో వారం, పది రోజులు పనికి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాల్సి వస్తే వైద్య ఖర్చులకు తోడు, కుటుంబ పోషణ తడిసి మోపెడవుతోంది ఇక వృద్ధులు, చిన్నారులు రోగాల బారిన పడితే కుటుంబం మొత్తానికి కాళ్లు, చేతులు ఆడవు. వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఫలితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తయితే ఏటా వచ్చే సీజనల్ వ్యాధుల అదుపుకోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తున్నది. అయినా మళ్లీ పరిస్థితి మామూలే. ఈ పరిస్థితి ఎంతకాలం? సీజనల్ వ్యాధులు రాకుండా పూర్తిగా అదుపు చేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాకపోవచ్చు కానీ తీవ్రతను తప్పకుండా కట్టడి చేయవచ్చు. అందుకు కావలసింది ప్రణాళికా బద్ధమైన చర్యలు మాత్రమే.నాలాలు, డ్రైనేజిల్లో మురుగు నీరు చేరకుండా చూడడం, బస్తీల్లో విచ్చలవిడి నిర్మాణాల కారణంగా అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజి వ్యవస్థను బాగు చేయడం వంటివి శాశ్వత ప్రాతిపదికన చేపట్టడం వల్ల దోమల బెడదను కొంతమేరకైనా తగ్గించవచ్చు. ఇక సీజనల్ వ్యాధుల పట్ల జనంలో అవగాహన పెంచడం వల్ల కూడా వారు వీటి బారిన పడకుండా చూడవచ్చు. ఫలితంగా కోట్ల రూపాయల ప్రజాధనం ప్రతి ఏటా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండదు. అయితే ప్రభుత్వం ఈ దిశగా నడుం బిగిస్తుందా అనేదే ప్రశ్న.