- శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
- జూరాలలో అదే పరిస్థితి
- సగం కూడా నిండని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
హైదరాబాద్/నల్లగొండ, జూలై 31 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాణాధారమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆశాజనకంగా వస్తున్న వరద ప్రభావంతో జూరాలతో పాటు తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి నిలకడగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో శ్రీశైలం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 3 లక్షలకు పైగా ఇన్‌ఫ్లో ఉననది. విద్యుత్ ఉత్పత్తితో పాటు 8 గేట్లు ఎత్తి సాగర్ దిశగా 3,09,600 క్యూసెక్కులను వదులుతున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు దాదాపు సగం నిండింది. 312.05 టీఎంసీలకు గాను బుధవారం సాయంత్రం 6 గంటలకు 161.97 టీఎంసీలకు చేరుకుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటున్నది. శుక్రవారం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
గోదావరికి తగ్గిన వరద ఉధృతి
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నదికి వరద ఉధృతి తగ్గింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎగువన మహారాష్ట్ర నుంచి సరైన వరద రాకపోవడంతో ప్రాజెక్టు ఇంకా కనీసం సగం కూడా నిండలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 90.300 టీఎంసీలు కాగా... బుధవారం సాయంత్రానికి 36.27 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కేవలం 5518 క్యూసెక్కులు మాత్రమే కావడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం వరకు తొమ్మిది మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. అదే విధంగా మేడిగడ్డ బరాజ్‌కు సైతం వరద తగ్గింది. మంగళవారం 7.25లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో ఉండగా బుధవారం 5.79లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని 85గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.
కడెం గేట్ల నుంచి నీటి లీకేజీ
నిర్మల్(విజయక్రాంతి): కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోని 13, 14, 15 నంబర్ల గేట్ల నుంచి నీరు లీకవుతున్నది. ఇటీవలే ప్రాజెక్టులో మర్మతులు చేపట్టి, కొత్త గేట్లు బిగించారు. అయినా కూడా గేట్ల నుంచి నీరు లీకవుతుండటం గమనార్హం. ఇటీవల తెరిచిన 4 గేట్లను రెండు రోజుల క్రితం మూసివేశారు. బుధవా రం నీటి లీకేజీని అధికారులు గుర్తిం చా రు. అయితే అది గేటు వల్ల వచ్చిన లీకేజీ కాదని, గేటు అడుగు భాగంలో చెత్త, కర్రగానీ ఉండటం వల్ల గేట్లు పూర్తిస్థాయిలో కిందకు దిగక నీరు లీకవు తుందని ప్రాజెక్టు డీఈ భోజదాస్ అన్నారు.