డబ్బులు ఇవ్వకుంటే అసభ్యకర ప్రదర్శనలు
ఇదేమిటని ప్రశ్నించారో ఆగమాగం
మునుగోడు,(విజయక్రాంతి): పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరుపుకోవాలని అనుకుంటారు. కానీ.. కొంతకాలంగా మునుగోడు మండల కేంద్రంలోని వివిధ ఫంక్షన్ హాల్ లో హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే .
ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఫంక్షన్లో 5000 నుండి 10000 డిమాండ్ చేయడంతో అందరూ జంకుతున్నారు. ఇది ఫంక్షన్ హాల్ యజమానుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని వేలకు వేలు అద్దె చెల్లించి తమ శుభకార్యాలను సంతోషంగా నిర్వహించుకునే విధంగా లేకుండా అనేక ఆటంకాలకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఈ సంఘటనలపై స్థానిక పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని హిజ్రాలపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొవాలని శుభకార్యాలు నిర్వహించే వ్యక్తులు కోరారు.