calender_icon.png 23 October, 2024 | 6:58 PM

విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టిన రిషబ్ పంత్

23-10-2024 04:49:48 PM

భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సీనియర్ సహచరుడు విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. తీవ్రమైన కారు ప్రమాదం తర్వాత ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన పంత్ బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ సాధించాడు. 27 ఏళ్ల రిషబ్ పంత్ బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 20, 99 పరుగులతో పోరాడాడు.

కివీస్ తో తొలి టెస్టులో రాణించడమేఅతని ర్యాంక్ పెరగడానికి కారణం. కివీస్‌పై అదే ఇన్నింగ్స్‌లో కోహ్లి 70 పరుగులు చేసినప్పటికీ, ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో ఉండగా, భారత్ యువ సంచలనం, ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి శ్రీలంకకు చెందిన దిముత్ కరుణరత్నేతో కలిసి సంయుక్తంగా 15వ ర్యాంక్‌లో నిలిచాడు. కాగా ప్రస్తుతం ఐసీసీ టెస్టు బ్యాంటింగ్ ర్యాంకిగ్స్ లో టాప్ 10లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం గమనార్హం. న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 36 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకోగా, కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే 36వ స్థానానికి చేరకున్నాడు.