ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం గల దేశంగా మనం నిలబడాలంటే అగ్రరాజ్యాలకు దీటుగా బలమైన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. దానికోసం భారత్ సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎగుమతుల సామర్థ్యం బాగా పెంచుకోవాలి. అంతరిక్ష రంగంలో మంగళయాన్, చంద్రయాన్ రక్షణ రంగంలో అగ్ని- శనివారం సాధించిన హైపర్ సోనిక్ ప్రయోగాల విజయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
ధ్వని వేగానికి ఐదు రెట్లు అధికంగా దూసుకెళుతూ, శత్రుదేశాల గగనతలాల రక్షణ వ్యవస్థల అంచనాలకు అందకుండా 1,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఎదుర్కొనే సత్తా కలిగి వుండటం మన హైపర్ సోనిక్ క్షిపణి ప్రత్యేకత. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రయోగం వల్ల చైనా, రష్యా, అమెరికా వంటి బలమైన దేశాల సరసన మన శాస్త్రవేత్తల కృషి మరోసారి చరిత్ర సృష్టించింది. అణ్వాయుధాలతో యుద్ధా లు అనివార్యం కాకున్నా స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతికతను మెరుగు పరిచేలా బలమైన రక్షణ వ్యవస్థను నిర్మించుకోవడం అవసరం.
చైనా, పాకిస్థాన్‌ల నుంచి భవిష్యత్తులో రాబోయే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పలు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. డ్రోన్లు, యుద్ధ విమాన ఇంజన్లు వంటివాటి త యారీలో వ్యూహాత్మకంగా వ్యవహరించవలసి ఉంది. డా॥ అబ్దుల్ కలాం అన్నట్లు బలమైన వారినే ప్రపంచం గౌరవిస్తుంది కనుక మన సాంకేతికతను ప్రపంచం నేర్చుకునే స్థాయికి దేశీయ రక్షణ పరికరాల ఎగుమతులు పెరగాలి. 2047 ‘వికసిత భారత్’ నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని ఆశిద్దాం.
- ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్‌కర్నూల్