17-03-2025 01:05:54 AM
న్యూఢిల్లీ, మార్చి 16: గుజరాత్‌లో 2002లో జరిగిన గోద్రా అల్లర్లను రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద అల్లర్లుగా చిత్రీకరించేందుకు కొందరు సమష్టిగా ప్రయత్నించారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అయితే అది వాస్త వానికి చాలా దూరంగా ఉందన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు కూడా రాష్ట్రంలో అల్లర్లు జరిగాయన్నారు.
2002కు ముందు రాష్ట్రంలో అల్లర్లు జరిగేవని పేర్కొన్నారు. అయితే తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో అల్లర్లు జరగలేదన్నారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్, ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్ నిర్వహించారు. ఈ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని అనేక అంశాలపై మాట్లాడారు.
2002లో అధికారంలో ఉన్న తన రాజకీయ ప్రత్యర్థులు గోద్రా అల్లర్లకు తనను బాధ్యుడ్ని చేసి శిక్షించాలనుకున్నట్టు చెప్పారు. న్యాయవ్యవస్థ ఒకటికి రెండు సార్లు మమ్మల్ని పూర్తిగా నిర్దోషులుగా తేల్చినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం తమ ప్రయత్నాలను విరమించుకోలేదని విమర్శించారు.
విమర్శలను స్వాగతిస్తా
విమర్శలను తాను స్వాగతిస్తానని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అయితే ఆ విమర్శలు మరింత నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. ప్రధానిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసే సమయంలో తాను పాకిస్థాను ఆహ్వానించినట్టు ప్రధాని గుర్తు చేశారు. ఆ దేశంతో శాంతి కోసం ప్రయత్నం చేసినప్పుడల్లా శతృత్వం, ద్రోహమే ఎదురైందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతి ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఆధారపడి ఉందన్నారు.