22-04-2025 12:00:00 AM
గ్యాస్ట్రాలజీ ఓపీ సేవలను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
ఆదిలాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నెలకొన్న డాక్టర్ల కొరతతో పాటు ఇత ర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయిన తర్వాత వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఏ ఒక్క పేషెంట్ చికిత్స కోసం హైదరాబాద్, నాగపూర్, ఇతర ప్రాంతాలకు పోయే అవసరం ఉండదని అన్నారు.
యశోద, అపోలో ఉన్నటువంటి అధునాతన పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్పెషాలిటీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాస్ట్రాలజీ ఓపీ సేవలను ఎంపీ, ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. అదేవిధంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, పలు వివరాలను డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను అడిగి తెలుసుకున్నారు.
`ఆనాడు ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణం చేపట్టడంతో పేదలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి లక్ష రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన స్తోమత లేని వారికి ఈ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.
కార్డియాలజిస్ట్‌తో పాటు మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్, పలువు రు వైద్యులు, బీజేపీ నాయకులు ఉన్నారు.