calender_icon.png 23 October, 2024 | 10:54 AM

సదాచారంగా సమాచార హక్కు

18-10-2024 12:00:00 AM

సుపరిపాలనను సాధించడం- భారత రాజ్యాంగ స్వప్నాల్లో ఒకటి. అది సాకారం కావాలంటే- ప్రభుత్వాలు పారదర్శకం గా పనిచేస్తూ, ప్రజలపట్ల జవాబుదారీతనం తో మెలగాలి. సర్కారీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందగ లిగే వీలు ప్రజానీకానికి ఉండాలి. అందుకు అవకాశం కల్పించేదే- సమాచార హక్కు చట్టం.

న్యాయపాలిక ఏనాడో అభివర్ణించినట్లు, ఆర్టీఐ అనేది- భావప్రకటనా స్వేచ్ఛ, గౌరవప్రద జీవనాలకు హామీ ఇచ్చే ఆర్టికల్ 19, 21వ రాజ్యాం గ అధికరణల్లో అంతర్భాగం. ఆ విధంగా అది ప్రజల ప్రాథమిక హక్కు. కానీ, ఆర్టీఐ శాసనం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన సమాచార కమిషన్లను నిర్వీర్యం చేయడంలో పార్టీల కు అతీతంగా అధికారపక్షాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.

సమాచార కమిషనర్ల నియామకంలో సర్కారీ వైఫల్యం- స.హ. చట్ట మౌలిక లక్ష్యాన్నే దెబ్బతీస్తోందని, ఆర్టీఐని నిర్జీవంగా మారుస్తోందని సుప్రీంకోర్టు గతం లో తీవ్ర ఆవేదన వెలిబుచ్చింది. దేశవ్యాప్తంగా కమిషనర్ల పోస్టుల భర్తీకి తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అడిగిన సమాచారాన్ని అధికారులు ఇవ్వనప్పుడు దరఖాస్తుదా రులు సమాచార కమిషన్లను ఆశ్రయిస్తారు.

అక్కడ వారి గోడు ఆలకించేవారే కరవైతే- ఇక స.హ.చట్టం ఉండీ ఏమిటి ప్రయోజనం? పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదా రితనం కోసం కేంద్రం 2005 అక్టోబర్ 12న ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతి, సమస్యలపై ప్రజా ప్రతినిధులే కాకుండా సామాన్యుడు సైతం ప్రశ్నించే విధం గా ఈ చట్టాన్ని రూపొందించారు.

ఈ చట్టం అమలులోకి వచ్చి 19 ఏళ్లు అయ్యింది. కానీ చట్టం అమలులో  ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఆరంభంలో చూపిన హడావిడి ఇప్పు డు ఎక్కడా కనిపించడం లేదు. చట్టంలో సెక్షన్-26 ప్రకారం ఆ చట్టం ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించాల్సిన రాజ్యాంగ బద్ధమైన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ రోజురోజుకూ ఆ చట్టాన్ని అటకెక్కించే పనిలో అన్ని ప్రభుత్వాలూ పనిచేస్తున్నాయా? అనే అనుమానా లు కలుగుతున్నాయి. 

ప్రభుత్వాలు జనానికి జవాబుదారీగా మెలగడం- ప్రజాస్వామ్య మనుగడకు ప్రాణప్రద మైంది. ఆ మేరకు పాలకులు ఏమి చేస్తున్నా రో, ఎటువంటి నిర్ణయాలను ఎందుకు తీసుకుంటున్నారో, వాటి ఫలితాలు ఎలా ఉంటు న్నాయో తెలుసుకోవడం- ప్రజల ప్రాథమిక హక్కు,కానీ, సర్కారీ దస్త్రాల్లోని సమాచారమంతా అందరికీ తెలిసిపోతే- తమ సామ్రా జ్యాలు కుప్పకూలిపోతాయని రాజకీయ నాయకుల భయం.

అందుకే పరిపాలనకు సంబంధించిన ఎన్నో కీలకాంశాలను వారు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చుతుంటారు.  ప్రజాఉద్యమాల ఫలితంగా 2005లో సమాచార హక్కు శాసనం పురుడుపోసుకున్నప్పటికీ దేశీయంగా పాలనలో పారదర్శకత మాత్రం నేటికీ సుదూర స్వప్నాన్నే తలపిస్తోంది. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని ముప్పు రోజు ల్లోగా అందించాలన్నది నిబంధన.

ఎవరూ అడగక మునుపే పదిహేడు అంశాలకు సం బంధించిన వివరాలను ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా వెల్లడించాలనీ స.హ.చట్టం నిర్దేశిస్తోంది. వీటిని తుంగలో తొక్కుతున్న అధికారులు- సమాచారం అందజేతలో నెలలూ సంవత్సరాల తరబడి జాప్యం చేస్తున్నారు. వెర్రిమొర్రి కొర్రీలతో దరఖాస్తులను తిరగ్గొడుతున్నారు.  

పాలనాపగ్గాలు చేతులు మారినంత మాత్రాన మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు. అధికార దుర్వినియోగాన్ని ఎదిరించగలిగిన శక్తిసామర్థ్యాలు ప్రజలందరూ సము పార్జించుకోగలిగిన నాడే నిజమైన స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇది బాపూజీ భవ్య సందేశం.

ప్రభుత్వాలను ప్రశ్నించే స్వేచ్చ స్వతంత్ర భారత పౌరులకు ఉండి తీరాలన్నది మహాత్ముడి దివ్య స్వప్నం! అయితే ఇంతవరకు అది నెరవేరలేదు.  సమాచార హక్కు చట్టానికి సమాధి కట్టే పని- పాలకుల చేతుల మీదుగా మహావేగంగా జరిగిపోతోంది.గత జూన్ నాటికి దేశ వ్యాప్తంగా 27 కమిషన్లలో 3.2 లక్షలకు పైగా రెండో అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఎందుకోసం ఖర్చుచేస్తున్నాయి? అది తెలుసుకోవడం పౌరుల హక్కు. కానీ, సాధారణ జనానికి తాము చెప్పేదేమిటి అన్న ధోరణి దేశీయంగా బుసలుకొడుతోంది. సమాచార కమిషన్లలో ఖాళీలను కాలానుగుణంగా సమర్థులతో భర్తీచేయని సర్కార్ల పాపమే- అపరిష్కృత అప్పీళ్లు,్ల ఫిర్యాదుల సంఖ్యను విపరీతంగా ఎగదోస్తోం ది.

ప్రజల సమాచార హక్కును తుంగలో తొక్కే అధికారులు జరిమానాలకు అర్హు లని చట్టం స్పష్టంచేస్తోంది. సమాచార కమిషన్లేమో నూటికి అయిదు సందర్భాల్లోనే ఆ కొరడాను ప్రయోగిస్తున్నాయి. దాంతో అధికారుల్లో ఆర్టీఐ పట్ల చులకనభావం అధికమవుతోంది.

ప్రజలకు జవాబుదారీ కావడం తమ ప్రాథమిక కర్తవ్యమని ప్రభుత్వాలూ అంగీకరించడం లేదు. అందువల్లే స.హ. చట్టం నీరుగారిపోయి- పౌరపాలన యావత్తూ చీకటిమయమవుతోంది! ఇకనైనా పౌరులు, సమాజం, ప్రజా ఉద్యమకారులు, మీడియా స.హ చట్టాన్ని కాపాడుకోవడానికి పూనుకోవాలి.

 మన్నారం నాగరాజు