అధికారులను అడ్డుకున్న స్థానికులు.. ఉద్రిక్తత
ఆదిలాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని ఖానాపూర్ చెరువు కబ్జాలపై విజయక్రాంతి దినపత్రికలో ఆగస్టు 31న ‘కబ్జా కోరల్లో ఖానాపూర్ చెరువు’ శీరికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపూర్ చెరువు ఆక్రమణలను గుర్తించేందుకు శుక్రవారం అధికారులు సర్వే ప్రారంభించారు.
చెరువు స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో ఇటీవల కలెక్టర్ రాజరిషా స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బల్దియా, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, సరే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖల అధికారులు చెరువు పరిధిలో వెలిసిన నివాసాల వద్దకు చేరుకుని సరే చేపట్టారు.
ప్రభావిత నివాస గృహాలకు మార్కింగ్ చేశారు. అధికారులు చేపడుతున్న సరేను స్థానిక కాలనీవాసులు అడ్డుకున్నారు. తమ నివాసాలను కూల్చివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి, ఇప్పుడు సర్వే ఏమిటని ప్రశ్నించారు. దీంతో కాలనీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.