calender_icon.png 23 December, 2024 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరిగొప్పుల కాంగ్రెస్‌లో చీలికలు

07-10-2024 12:00:00 AM

మండలాధ్యక్షుడి ఒంటెత్తు పోకడ?

సీనియర్ నేతల ఆగ్రహం

తరిగొప్పుల, అక్టోబర్ ౬: జనగామ జిల్లా కాంగ్రెస్‌లో చీలికలు, గ్రూపు తగాదాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. కొన్ని రోజులుగా డీసీసీ అధ్యక్షుడిపై నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో తరిగొప్పు ల కాంగ్రెస్‌లోనూ చీలికల వ్యవహారం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది.

కాంగ్రెస్ తరిగొప్పుల మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరిగౌడ్ తీరుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్నారు. మండల కమిటీతోపాటు పార్టీ కార్యక్రమాలన్నింటిలో ఆయన అనుచరులు తప్ప మరొకరికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మొదటి నుంచి హస్తం పార్టీని అంటుపెట్టుకున్నవారు, కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నా రు.

యాదగిరి తీరుతో మండలంలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముందని, ఆయనను తప్పించి మరొకరికి పగ్గాలు ఇవ్వాలని పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మండలంలో పార్టీ పరిస్థితిపై గాంధీభవన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

మండల అధ్యక్షుడిపై సీనియర్లు మండిపడుతున్న క్రమంలో ఇటీవల గాంధీ జయంతి రోజున ఎవరికీ సమాచారమివ్వకుండానే మండల ఉపాధ్యక్షుడిని నియమించడం మరింత రచ్చకు దారితీసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా వగలబోయిన యాదగిరికి వ్యతిరేకంగా కొందరు కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.

మండల స్థాయిలో పలు ఉద్యోగాల విషయంలో ఆయన వసూళ్లకు పాల్పడ్డారంటూ సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా ఆరోపణలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. ఆయనను మండల అధ్యక్షుడిగా కొనసాగిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరని నష్టం  జరుగుతుందని చెప్తున్నారు. మొత్తంగా తరిగొప్పుల కాంగ్రెస్‌లో చీలికల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.